Chandrababu: వివేకా మరణం తరువాత జగన్ కుతంత్రం: చంద్రబాబు

  • వివేకాకు, జగన్ కు మధ్య రాజకీయ వైరం
  • హత్యను గుండెనొప్పిగా పక్కదారి పట్టించారు
  • సిట్ విచారణలో మొత్తం బయటకు వస్తుంది
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు

వైఎస్ వివేకానందరెడ్డి మరణం తరువాత వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ కుతంత్రాలకు పాల్పడ్డారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, చిన్నాన్న హత్యనే గుండెనొప్పిగా చెప్పి పక్కదారి పట్టించిన ఘనుడు ఆయనని విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకాతో జగన్ కు రాజకీయ వైరం ఉందని, ఆయన ఎంపీగా ఉన్నవేళ, రాజీనామా చేయాలని జగన్ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. సిట్ విచారణలో అన్ని విషయాలూ బయటకు వస్తాయని, ఈ కేసులో దోషులను వదిలిపెట్టబోనని హెచ్చరించారు.

తాను ఎక్కడికి వెళ్లినా టీడీపీ పట్ల అపూర్వ ఆదరణ కనిపిస్తోందని, రైతులు, మహిళలు, యువత తోడ్పాటుతో ఎన్నికలు ఏకపక్షంగా సాగనున్నాయని అన్నారు. లబ్దిదారులంతా తెలుగుదేశంవైపే ఉన్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు, నామినేషన్ల రోజే టీడీపీ గెలుపు ఖరారు కావాలని పిలుపునిచ్చారు. జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఊహించనంత ఆధిక్యత లభిస్తుందనడంలో సందేహం లేదని చెప్పారు.

ఇది అభివృద్ధికి, అరాచకానికీ మధ్య జరిగే ఎన్నికని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని, దౌర్జన్యాలు పెరిగిపోతాయని హెచ్చరించిన చంద్రబాబు, అమానుషాలకు పాల్పడేవారికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆంధ్రా వ్యతిరేకులతో అంటకాగుతున్న పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు.

More Telugu News