YSRCP: లేఖలో ఉన్నది వివేకా చేతిరాతేనని ఆయన కుమార్తె సునీత అంగీకరించారు: కడప ఎస్పీ

  • వివేకా హత్యపై పోలీస్ ప్రెస్ మీట్
  • వివరాలు తెలిపిన రాహుల్ దేవ్ శర్మ
  • డ్రైవర్ కు ప్రాణహాని ఉంటుందని లేఖను ఆలస్యంగా ఇచ్చారు!

వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదివారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివేకా హత్యపై అనేక వివరాలు తెలిపారు. రాత్రి బాగా పొద్దుపోయిన సమయంలో 11.30 గంటలకు ప్రచారం నుంచి ఇంటికి వచ్చారని, అయితే ఉదయం కల్లా ఆయన విగతజీవుడిలా కనిపించినట్టు తెలిసిందని అన్నారు. అయితే మొదట రక్తం వాంతి చేసుకుని కమోడ్ కు గుద్దుకుని చనిపోయినట్టు చెప్పారని, దాంతో ఆ విధంగానే కేసు నమోదైందని వెల్లడించారు.

కానీ పోస్టుమార్టంలో గాయాలు బయటపడడంతో ఇది హత్య అని తేలిందని చెప్పారు. అప్పటికి సాయంత్రం అయిందని, వివేకా కుమార్తె సునీత.. పీఏ కృష్ణారెడ్డి ద్వారా లేఖను పోలీసులకు అందించారని వివరించారు. లేఖ ఉదయం దొరికితే సాయంత్రం వరకు ఎందుకు ఇవ్వలేదని తాము ప్రశ్నిస్తే... డ్రైవర్ కు ప్రాణహాని ఉంటుందన్న కారణంతో వివేకా కుమార్తె సునీత అప్పుడే ఇవ్వొద్దని చెప్పినట్టు పీఏ కృష్ణారెడ్డి తెలిపారని ఎస్పీ వెల్లడించారు. అయితే, వివేకా ఇంట్లో దొరికిన లేఖలో ఉన్న చేతిరాత తన తండ్రిదేనని సునీత అంగీకరించినట్టు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని, ఈ కేసులో ఇప్పటివరకు 20 మందిని ప్రశ్నించామని చెప్పారు.

More Telugu News