ys viveka: వైయస్ వివేకా డెడ్ బాడీని ఎవరు తరలించారు? రక్తపు మరకలు ఎవరు తుడిచేశారు?: కనకమేడల

  • వివేకా మృతి చిన్న కేసేనని పోలీసులకు మీవాళ్లు ఎందుకు చెప్పారు?
  • హత్య జరిగినట్టు క్లియర్ గా తెలుస్తున్నా.. గుండెపోటుతో చనిపోయారని ఎందుకు చెప్పారు?
  • శవ పంచనామా జరగకుండానే పోస్ట్ మార్టంకు ఎందుకు తరలించారు?

వైయస్ వివేకానందరెడ్డి హత్య వెనుక పెద్ద కుట్ర దాగుందని... విచారణ అన్ని కోణాల్లో జరిగితే... హత్య వెనుక ఎవరి హస్తం ఉందనే విషయం వెలుగులోకి వస్తుందని టీడీపీ నేత కనకమేడల అన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, వైసీపీపై విమర్శలు గుప్పించారు. వివేకా మరణించిన ఎన్ని గంటల తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు? ఈ లోగా వివేకా నివాసం వద్దకు ఎవరెవరు వచ్చారు? వారు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఒక వేళ బాత్రూమ్ లో ఆయన చనిపోతే... ఆయన మృత దేహాన్ని బయటకు ఎవరు తీసుకొచ్చారని అన్నారు. బెడ్రూమ్ లో ఉన్న రక్తపు మరకలను ఎవరు తుడిచేశారని ప్రశ్నించారు.

వివేకా మృతి చిన్న కేసేనని పోలీసులకు మీవాళ్లు ఎందుకు చెప్పారని కనకమేడల అడిగారు. ఇది చిన్న విషయమేనని, కేసు అవసరం లేదని మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి చెప్పినట్టు మొదటి వర్షన్ బయటకు వచ్చిందని అన్నారు. ఆ తర్వాత హైదరాబాదులో ఉన్న వివేకా కుమార్తె పోలీసులతో మాట్లాడిన తర్వాత కేసు నమోదు చేశారని చెప్పారు. ఒంటి మీద అన్ని గాయాలుంటే... గుండెపోటుతో మరణించారని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. హత్య జరిగినట్టు క్లియర్ గా కనిపిస్తున్నప్పటికీ... గుండెపోటుతో మరణించారనే వాదనను ఎందుకు తీసుకొచ్చారని అన్నారు. అక్కడున్న సాక్ష్యాధారాలను ఎందుకు తుడిచివేశారని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

వివేకా నివాసంలో మీరు తప్ప మరెవరూ లేరని కనకమేడల అన్నారు. ఆయన చనిపోయిన విషయాన్ని మీరే బయటపెట్టారని, రక్తపు మరకలను మీరే తుడిచేశారని చెప్పారు. బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ కు మృతదేహాన్ని మార్చడం, అక్కడి నుంచి బయటకు తీసుకురావడం, శవ పంచనామా చేయకుండానే పోస్ట్ మార్టంకు తరలించడం... ఇవన్నీ మీరే చేశారని ఆరోపించారు. ఒక హత్య జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ కూడా జరగకుండా మీరు ఎందుకు అడ్డుకున్నారనే విషయంపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ చూసిన తర్వాత ఈ హత్య వెనుక ఒక కుట్ర కోణం ఉందని... దీనికి వెనుక ఎవరి హస్తం ఉందనే విషయం ప్రజలకు అర్థమవుతోందని అన్నారు.

ఆయుధంతో ఎంత దూరం నుంచి కొడితే గాయం ఎలా అవుతుంది? ఎంత దగ్గర నుంచి కొడితే గాయం ఎలా అవుతుంది? ఏ ఆయుధంతో హత్య చేశారు? అనే అంశాలు విచారణలో వెలుగుచూడాలని కనకమేడల చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు లేనందువల్ల... పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విచారణ జరపాలని... అప్పుడే అసలైన కుట్ర బయటపడుతుందని అన్నారు. ఐపీసీ సెక్షన్ 201 కింద హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కనపడకుండా చేయడం కూడా హత్యానేరంతో సమానమని చెప్పారు. హత్యకు కుట్ర పన్నిన వారు ఎంత నేరస్తులో... సాక్ష్యాలు లేకుండా చేసిన వారు కూడా అంతే నేరస్తులని తెలిపారు.

పోలీసు కేసు నమోదై, విచారణ ప్రారంభమైన తర్వాత కూడా ఈ హత్యను రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం జరిగిందని కనకమేడల విమర్శించారు. విజయసాయిరెడ్డి నుంచి పలువురు వైసీపీ నేతలు ఈ అంశంపై రకరకాల వ్యాఖ్యలు చేశారని చెప్పారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే సంస్కృతి టీడీపీది కాదని అన్నారు. పోలీసు విచారణకు సహకరించకుండా, పోలీసుల మనోభావాలను కించపరుస్తూ... సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.

కోడికత్తి కేసులో కూడా రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదంటూ ఎన్ఐఏ చేత విచారణ జరిపించుకున్నారని... చివరకు రాష్ట్ర పోలీసులు ఏదీ తేల్చారో, దాన్నే ఎన్ఐఏ ధ్రువీకరించిందని కనకమేడల చెప్పారు. అయినా ఇప్పటికీ జగన్ పై కోడికత్తితో హత్యాయత్నం జరిగిందనే విషయాన్ని వైసీపీ పదేపదే ప్రస్తావిస్తోందని అన్నారు. చిన్న గాయాన్ని హైదరాబాదులోని సొంత మనుషుల ఆసుపత్రిలో పెద్దగా చేయించుకుని జగన్ చూపించుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వివేకా హత్య కేసును కూడా సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారని... దీంతో, మీ పాత్రపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు.

More Telugu News