abhinandan: అభినందన్ విచారణ పూర్తి.. సిక్ లీవ్ పై వెళ్లనున్న వింగ్ కమాండర్

  • అభినందన్ ను విచారించిన వాయుసేన, ఇతర సంస్థల అధికారులు
  • కొన్ని వారాల పాటు సిక్ లీవ్ పై వెళ్లాలని వైద్యుల సూచన
  • పాక్ ఆర్మీ కస్టడీలో 59 గంటల పాటు ఉన్న అభినందన్

పాక్ అత్యాధునిక విమానాన్ని కుప్పకూల్చి, పాక్ సైన్యానికి పట్టుబడి, ఆ తర్వాత విజేతగా సగౌరవంగా భారత్ లో అడుగుపెట్టిన భారతీయ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ విచారణ పూర్తయింది. వాయుసేన అధికారులతో పాటు ఇతర సంస్థల అధికారులు ఆయనను విచారించారు. విచారణ పూర్తి కావడంతో... ఢిల్లీలోని ఆర్మీ రీసర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు అభినందన్ కొన్ని వారాల పాటు సిక్ లీవ్ పై వెళ్లనున్నారు. ఈ మేరకు భారత వాయుసేన వర్గాల నుంచి సమాచారం అందిందని ఏఎన్ఐ తెలిపింది.

మార్చ్ 3న అభినందన్ కు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. అతని శరీరంలో పాక్ ఆర్మీ ఎలాంటి బగ్స్ అమర్చలేదని వైద్యులు నిర్ధారించారు. విమానం నుంచి పారాచూట్ సహాయంలో ల్యాండ్ అయిన సందర్భంలో, ఆయన వెన్నుపూస కింద భాగంలో చిన్నపాటి గాయం అయిందని తేలింది. మరోవైపు, పాకిస్థానీ స్థానికుల దాడిలో అతని పక్కటెముకకు గాయం అయిందని కూడా తేలింది. పాకిస్థాన్ ఆర్మీ అధీనంలో ఉన్నప్పుడు తనను మానసికంగా వేధించారని అభినందన్ చెప్పిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కస్టడీలో అభినందన్ దాదాపు 59 గంటల సేపు ఉన్నారు.

More Telugu News