RRR: మామూలు వాళ్లనే సూపర్ హీరోలుగా చూపిస్తా... వీళ్లు సూపర్ హీరోలే... ఆ సందేహం వద్దు: రాజమౌళి

  • 'ఆర్ఆర్ఆర్'పై తొలిసారిగా మీడియాతో మాట్లాడిన రాజమౌళి
  • వివాదాలు రాకుండా ఉండవు
  • ఇద్దరినీ ఉన్నతంగానే చూపిస్తానని వెల్లడి

తాను మామూలుగా తీసే సినిమాల్లోనే హీరోలను సూపర్ హీరోలుగా చూపిస్తానని, ఇక ఇద్దరు సూపర్ హీరోల కథనే తీసుకున్నప్పుడు వారిని ఎలా చూపిస్తానన్న సందేహమే మీకు వద్దని దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యానించారు. చరిత్రలో ఇద్దరు పోరాట యోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు యువకులుగా ఉన్న సమయంలో వారిద్దరూ కలిస్తే ఏం జరిగివుంటుందన్న కథాంశంతో తాను తెరకెక్కిస్తున్న చిత్రంపై తొలిసారిగా మీడియాతో మాట్లాడిన రాజమౌళి, మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

చరిత్రలో పేరున్న వారితో సినిమాలు తీసేటప్పుడు ఎన్నో వివాదాలు వస్తుంటాయని, ఈ చిత్రంలో వివాదాలు రాకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏ కథతోనూ, ఎవరితోనూ సంబంధం లేకుండా తీసిన 'బాహుబలి'పైనే వివాదాలు వచ్చాయని గుర్తు చేసిన రాజమౌళి, వివాదాలు సహజమని అన్నారు. తాను వీరిద్దరినీ మరింత ఉన్నతంగానే చూపించనున్నానని స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజును కృష్ణగారు తీసినప్పుడే వివాదాలు వచ్చాయని, అన్నమయ్య తీసిన సమయంలోనూ అదే జరిగిందని, అంతమాత్రాన వాటిని తీయడం మానేయాలా? అని ప్రశ్నించారు. అద్భుతమైన కథ మన వద్దకు వచ్చినప్పుడు దాన్ని తీయకుండా మానకూడదన్నది తన అభిప్రాయమని చెప్పారు. 

More Telugu News