South central railway: సీజనల్ టికెట్లపై ప్రయాణించే వారికి రైల్వే గొప్ప శుభవార్త.. ప్రయాణ దూరాన్ని పెంచిన రైల్వే

  • సీజనల్ టికెట్లపై ప్రస్తుతం గరిష్టంగా 150 కిలోమీటర్లకు మాత్రమే అనుమతి
  • ప్రయాణికుల డిమాండ్‌తో పది కిలోమీటర్లు పెంచిన రైల్వే
  • మొత్తం 12 మార్గాల్లో అమలు

సీజనల్ టికెట్లపై నిత్యం ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఈ టికెట్లపై గరిష్టంగా 150 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు దానిని మరో 160 కిలోమీటర్లకు పెంచింది. రైల్వే నిర్ణయంతో ప్రయాణికులకు బోల్డంత ఊరట లభించినట్టు అయింది.

నిజానికి ఇప్పటి వరకు ఉన్న నిబంధన వల్ల 150 కిలోమీటర్లకు గమ్యస్థానం ఒక్క కిలోమీటరు ఎక్కువ ఉన్నా అదనంగా టికెట్ తీసుకోవాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో ఇప్పుడా బాధ తప్పింది. ఉదాహరణకు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు నిత్యం రాకపోకలు సాగించేవారు వందల్లో ఉంటారు.

వరంగల్-హైదరాబాద్ మధ్య దూరం 152 కిలోమీటర్లు. దీంతో అదనంగా ఉన్న రెండు కిలోమీటర్లకు టికెట్ కొనుక్కోవాల్సి వస్తోంది. అంతేకాదు, ఏపీలోనూ నిత్యం రాకపోకలు సాగించే స్టేషన్ల మధ్య దూరం 150 కిలోమీటర్లకు మించి ఉంటోంది. దీంతో ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్లపై స్పందించిన రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న 12 మార్గాల్లో దీనిని అమలు చేయాలని రైల్వే నిర్ణయించింది.

More Telugu News