Rayadurgam: పనిచేయని జేసీ బుజ్జగింపు... 'మెట్టు' దిగని గోవిందరెడ్డి.. వైసీపీలోకి జంప్!

  • రాయదుర్గంలో టీడీపీ నేత మెట్టు గోవిందరెడ్డి
  • వైసీపీలోకి వెళుతున్నారన్న వార్తలతో బుజ్జగింపులు
  • అయినా వినకుండా కార్యకర్తల మాటంటూ రాజీనామా

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలో అసమ్మతిని చల్లార్చడానికి జీసీ దివాకర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నేతల బుజ్జగింపులకు మెట్టు గోవిందరెడ్డి మెత్తబడలేదు. "టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఏం చేస్తావు? సీఎంగా చంద్రబాబు గెలుపు ఖాయం. పిచ్చి ఆలోచనలు చేసి బుర్ర చెడగొట్టుకోవద్దు. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. నేను చూసుకుంటా" అంటూ రాయదుర్గం టీడీపీ నేత మెట్టు గోవిందరెడ్డిని, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సముదాయించగా, ఆపై గంటలోపే మెట్టు వైసీపీలో చేరిపోయారు. జేసీతో మాట్లాడిన అనంతరం తాను పార్టీకి రాజీనామా చేయబోవడం లేదని మీడియాతో చెప్పి, పరిస్థితి అదుపులోనే ఉందని భావించిన జేసీ అటు వెళ్లగానే, ఇటు ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

అంతకుముందు రాయదుర్గంలోని మెట్టు ఇంటికి వచ్చిన మంత్రి కాలవ శ్రీనివాసులు ఏకంగా నాలుగు గంటల పాటు చర్చలు జరిపి, పార్టీ మారే ఆలోచన వద్దని సూచించారు. మెత్తబడ్డట్టు కనిపించిన ఆయన, మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే, ఆయన అనుచరులు, టీడీపీలో ఉండవద్దని, వైసీపీలోకి వస్తామని ఇప్పటికే చెప్పేశామని గుర్తు చేస్తూ, హంగామా చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆయన, కార్యకర్తల అభీష్టం మేరకు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాజా పరిణామాలతో రాయదుర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

More Telugu News