Facebook: 'అమెరికా' అమ్మాయి వలపు వల... అడ్డంగా మోసపోయిన హైదరాబాద్ యువకుడు!

  • ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతి
  • అమెరికాలో ఉన్నానంటూ మాటామంతీ
  • దారుణంగా మోసపోయిన చిరుద్యోగి

అమ్మాయిలు కూడా సైబర్ నేరగాళ్లుగా మారిపోయి, తమ వలలో చిక్కిన వారి బ్యాంకు ఖాతాలను గుల్ల చేసేస్తున్నారు. "ఒంటరిగా ఉన్నాను, వచ్చిపోరాదు" అంటూ అమ్మాయి విసిరిన వలపు వలలో చిక్కుకున్న ఓ హైదరాబాద్ యువకుడు దారుణంగా మోసపోయాడు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, టోలీచౌకీ ప్రాంతంలోని ఓ ఐస్ క్రీమ్ షాపులో సేల్స్ మేనేజర్ గా ఉన్న మహ్మద్ ముసా ఇనాయత్ అలీ అనే యువకుడికి ఫేస్ బుక్ లో బెల్లీలీ అనే యువతి పరిచయం అయింది. తాను యూఎస్ లో ఉంటున్నానని, ఇండియన్ తో స్నేహం కుదరడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పింది. వారి స్నేహం ఫేస్ బుక్ నుంచి వాట్స్ యాప్ వరకూ, ఆపై ఫోన్లలో మాట్లాడుకునేంత వరకూ వెళ్లింది.

ఈ క్రమంలో అమెరికాలో తాను ఒంటరిగా ఉన్నానని, కొద్దిరోజుల పాటు తనతో ఉండేందుకు అమెరికాకు రావాలని కోరిన ఆమె, విమాన టికెట్లు, కొత్తదుస్తులు కొనేందుకు 7 వేల అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ. 5 లక్షలు) పంపుతున్నట్టు చెప్పింది. శంషాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి కాల్ వస్తుందని, వెళ్లి డబ్బు తీసుకుని వెంటనే అమెరికాకు వచ్చేయాలని సూచించింది.

ఆపై ఈ నెల ప్రారంభంలో ఫిబ్రవరి 2న, తన పేరు శ్రుతి అని, ఎయిర్ పోర్టు కస్టమ్స్ విభాగంలో పని చేస్తున్నానని పరిచయం చేసుకున్న ఓ యువతి, మీకోసం అమెరికా నుంచి వచ్చిన పార్సిల్‌ లో 7 వేల డాలర్లు ఉన్నాయని, దాన్ని పంపాలంటే, సుంకాల నిమిత్తం రూ. 30 వేలు కట్టాలని కోరింది. డబ్బుపై ఆశతో ఇనాయత్‌ రూ. 30 వేలు ఆమె చెప్పిన ఖాతాకు పంపగానే, ఆదాయపు పన్ను, జీఎస్‌టీ కింద రూ. 75 వేలు కట్టాలని చెప్పింది. దీంతో ఇనాయత్ ఆ డబ్బులు కూడా వేశాడు. మూడు రోజులైనా పార్సిల్‌ తన ఇంటికి చేరకపోవడంతో బెల్లీలీకి ఫోన్‌ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో శ్రుతికి ఫోన్‌ చేశాడు. అటునుంచీ స్పందన లేకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

More Telugu News