Telangana: తెలంగాణలో అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ టీడీపీ పోటీ.. సికింద్రాబాద్ నుంచి కూన వెంకటేశ్ గౌడ్

  • తెలంగాణలో ఎన్నికలకు టీటీడీపీ సిద్ధం
  • నేడు అమరావతిలో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
  • కూన పోటీపై నిర్ణయం తీసుకునే అవకాశం

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో పోరుకు టీడీపీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలని యోచిస్తోంది. రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు కూన వెంకటేశ్ గౌడ్‌ను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు మంగళవారం బేగంపేటలోని ఆయన నివాసంలో నగర అధ్యక్షుడు ఎంఎన్‌ శ్రీనివాస్‌, ముఖ్య నేతలైన సారంగపాణి, బీఎన్‌రెడ్డి, భజరంగ్‌శర్మ, వనం రమేష్‌‌లు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో సికింద్రాబాద్ నుంచి కూన వెంకటేశ్ గౌడ్‌ను నిలపాలని సమావేశంలో పాల్గొన్న వారిలో మెజారిటీ నేతలు ప్రతిపాదించారు. వెంకటేశ్ గౌడ్‌ను బరిలోకి దించడం ద్వారా  సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో   టీడీపీకి భారీగా ఓట్లు పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బీసీల ఓట్లతోపాటు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా గంపగుత్తగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే, అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని, దానికి కట్టుబడి ఉండాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. మరోవైపు టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌రెడ్డి సైతం పోటీకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పోటీ విషయమై నేడు అమరావతిలో జరగనున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

More Telugu News