వైసీపీలోకి వెళ్లిన వారు మళ్లీ వస్తామంటున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

  • వైసీపీలో టికెట్ కోసం వేలం
  • ఎవరు ఎక్కువిస్తే వారికే టికెట్
  • సంక్షేమం కొనసాగాలంటే టీడీపీ రావాలన్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన వారు, ఇప్పుడు తిరిగి వెనక్కు వస్తామని అడుగుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఉండవల్లి ప్రజావేదికలో కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, 20 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, నేడు, రేపు జరిపే సమీక్షల్లో అక్కడి నుంచి పోటీ చేసేవారిని కూడా ఖరారు చేస్తామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయాలని భావించే అభ్యర్థుల మధ్య వేలం పాట నిర్వహించి, ఎవరు ఎక్కువ డబ్బిస్తే, వారికి టికెట్ ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఐదేళ్లు ఎంతో శ్రమించామని, పేదలకు అందుతున్న సంక్షేమం కొనసాగాలంటే, మరోసారి తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి రావాలని అన్నారు. ఎన్నికల సమర శంఖారావం తిరుపతిలో పూరిస్తామని, ఎన్నికల ప్రచారాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభిస్తామని అన్నారు. ప్రజాసేవే ప్రామాణికంగా తాను అభ్యర్థులను ఎంపిక చేశానని, వారిని గెలిపించే బాధ్యతలను ప్రతి కార్యకర్తా తీసుకోవాలని సూచించారు. మరో ఒకటి, రెండు రోజుల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు.
Go Back to Shorts
Telugudesam
Chandrababu
YSRCP
Assembly
Elections

More Telugu News