MAA: ‘మా’ ఎన్నికల్లో నరేశ్ విజయం.. ప్రధాన కార్యదర్శిగా జీవిత ఎన్నిక

  • శివాజీ రాజా-నరేశ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీ
  • అర్ధరాత్రి వెలువడిన ఫలితాలు
  • స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన హేమ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)  అధ్యక్ష పీఠం కోసం శివాజీ రాజీ- నరేశ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేశ్ విజయం సాధించాడు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది.  ‘మా’లో మొత్తం 745 ఓట్లు ఉండగా ఈసారి అత్యధికంగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికల్లో తొలి ఓటును నరేశ్ వేయగా, చివరి ఓటును పాతతరం హాస్యనటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నాడు. కృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడంతో జూబ్లీహిల్స్‌లోని ఫిలించాంబర్ సందడిగా మారింది. ప్రముఖులను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చాంబర్ వద్దకు చేరుకున్నారు. కాగా, ఆదివారం అర్ధరాత్రి దాటాక ఫలితాలను వెల్లడించారు.

అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేశ్ ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా జీవితారాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా  ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల గెలుపొందారు. కేరక్టర్ నటి హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరీ గెలుపొందడం గమనార్హం.

More Telugu News