Facebook: ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ కార్యాలయంలో రహస్య సొరంగం!

  • సెక్యూరిటీ సిబ్బంది కథనం
  • అత్యవసర స్థితిలో తప్పించుకునేందుకు ప్రత్యేక మార్గం!
  • ప్రధాన కార్యాలయంలో నమ్మశక్యంకాని భద్రతా ఏర్పాట్లు!

ప్రపంచంలో పేరెన్నికగన్న అపర కుబేరులు తమ వ్యక్తిగత భద్రత కోసం భారీ ఏర్పాట్లు చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కొందరు సంపన్నులకు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు, దుర్భేద్యమైన వాహనశ్రేణులతో దేశాధినేతలకు దీటుగా రక్షణ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ కు సంబంధించి ఆసక్తికరమైన భద్రతా ఏర్పాటు వెలుగులోకి వచ్చింది.

 'మెన్లో పార్క్'లోని  ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో నమ్మలేని రీతిలో ఓ రహస్య సొరంగం ఉన్నట్టు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ కార్యాలయాల భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించే సంస్థకు చెందిన ఉద్యోగుల కథనం ప్రకారం... అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడేందుకు ఈ రహస్య సొరంగం ఉపయోగపడుతుంది. ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయం నుంచి ఈ సొరంగం ఓ సురక్షితమైన ప్రాంతానికి దారితీస్తుందని వెల్లడించారు. అయితే ఈ కథనాన్ని ఫేస్ బుక్ యాజమాన్యం కానీ, ఇతర సాధారణ ఉద్యోగులు కానీ ఖండించనూ లేదు, అలాగని నిజమని అంగీకరించనూ లేదు.

జుకెర్ బర్గ్ ఫేస్ బుక్ సీఈఓ అయినా ఆయనకంటూ ప్రత్యేకంగా కార్యాలయం అంటూ ఏమీలేదు. అందరు ఫేస్ బుక్ ఉద్యోగుల్లాగానే సాధారణ క్యాబిన్ లో తన విధులు నిర్వర్తిస్తారు. అయితే, ఓ ప్రపంచ దిగ్గజ సంస్థకు సీఈఓగా ఉన్నా సమీపంలో ఎవరూ సెక్యూరిటీ గార్డులు ఉండరని, అతని క్యాబిన్ కింద భాగంలో ఎవరూ కార్లు పార్క్ చేయరని సదరు కథనంలో పేర్కొన్నారు. ఎవరైనా కారు బాంబులతో దాడి చేసే ప్రమాదం ఉండడంతో జుకెర్ బర్గ్ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. గతేడాది ఫేస్ బుక్ పాలకమండలి జుకెర్ బర్గ్ కుటుంబం భద్రత కోసం 10 మిలియన్ డాలర్లు కేటాయించింది. ఈ మేరకు బిజినెస్ ఇన్ సైడర్ మీడియా సంస్థ ఓ కథనం వెలువరించింది.

More Telugu News