మురళీమోహన్, తోట నరసింహంలతో పాటు మాగుంట కూడా... ఎంపీ సీటు వద్దే వద్దంటూ చంద్రబాబుకు స్పష్టం!

08-03-2019 Fri 10:29
  • ఎంపీ టికెట్ తమకు వద్దంటున్న నేతలు
  • ఒంగోలు స్థానం మాగుంటకు దక్కుతుందని వార్తలు
  • తాను పోటీ చేయలేనని చెప్పిన మాగుంట!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా తాము పోటీ చేయలేమని, తమ పేర్లు ప్రకటించవద్దని చెబుతున్న నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌తో పాటు కాకినాడ ఎంపీ తోట నరసింహం తాము ఎన్నికల్లో పోటీ చేయలేమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి స్పష్టం చేసినట్టు వార్తలు వస్తుండగా, ఒంగోలు నేత మాగంట శ్రీనివాసులు రెడ్డి కూడా అదే మాట చెప్పినట్టు తెలుస్తోంది.

ఒంగోలు నుంచి టీడీపీ టికెట్ ను మాగుంటకు ఇస్తారని అందరూ భావిస్తున్న నేపథ్యంలో, పోటీకి తనను బలవంతం పెట్టవద్దని ఆయన చంద్రబాబుకు వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల పవన్ కల్యాణ్, ఒంగోలు పర్యటనకు వచ్చిన వేళ, మాగుంట ప్రత్యేకంగా వెళ్లి ఆయన్ను కలిసి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తామిద్దరమూ వ్యక్తిగతంగా కలిశామని, రాజకీయ కారణాలు ఏమీ లేవని స్వయంగా మాగుంట వెల్లడించినా, వీరిద్దరి కలయికా రాజకీయ చర్చకు తెరలేపింది.