Hyderabad: హైదరాబాద్‌లో నర్సు ప్రాణం తీసిన ఇయర్‌ఫోన్స్.. రైలు ఢీకొని మృతి

  • చెవిలో ఇయర్ ఫోన్స్‌తో పట్టాలు దాటే ప్రయత్నం
  • రైలు వస్తున్న శబ్దం వినిపించకపోవడంతో ప్రమాదం
  • ఖైరతాబాద్‌లో ఘటన
ఇయర్ ఫోన్స్‌ మరొకరి ప్రాణాలను బలిగొన్నాయి. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతున్న యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో జరిగిందీ ఘటన. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన రేఖా మహల్ (25) లక్డీకాపూల్‌లోని టెలిఫోన్ భవన్ సమీపంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్లోబల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

గురువారం ఉదయం జిమ్‌కు వెళ్లిన రేఖ తిరిగి లక్డీకాపూల్ వెళ్లేందుకు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని గేట్ వద్దకు చేరుకుంది. అప్పటికే గేటు వేసి ఉండడంతో గేటు దాటి లోపలికి వెళ్లింది. అదే సమయంలో నాంపల్లి వైపు  రైలు వెళ్లగానే లైన్ క్లియర్ అయిందని భావించిన రేఖ వడివడిగా అడుగులు ముందుకు వేసింది. అయితే, అదే సమయంలో నాంపల్లి వైపు నుంచి లింగంపల్లి వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలును గమనించకపోవడంతో అది వేగంగా వచ్చి ఢీకొంది.

గమనించిన స్థానికులు వెంటనే ఆమెను గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల రైలు వస్తున్న శబ్దం ఆమెకు వినిపించలేదని, ఈ కారణంగానే ఆమె పట్టాలు దాటేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Khairatabad
Nurse
Rail accident
Global hospital

More Telugu News