Anantapur District: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

  • మడకశిర నుంచి అశ్వద్ధ నారాయణ
  • వెల్లడించిన రఘువీరారెడ్డి
  • నెలాఖరులోగా అందరి పేర్ల ప్రకటన
త్వరలో ఆంధ్రప్రదేశ్ కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరఫున ప్రముఖ న్యాయవాది హరేసముద్రం అశ్వద్ధ నారాయణ పోటీ పడతారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. నిన్న నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి రాలేకపోయిన ఆయన ఫోన్ ద్వారా ఈ సందేశాన్ని ఇచ్చారు.

నారాయణ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, ఏపీ విడిపోయిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు ప్రచారంతో ఆ పార్టీ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా అన్ని అసెంబ్లీలకూ అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా రఘువీరారెడ్డి వెల్లడించారు.
Anantapur District
Madakasira
Ashwadhdha Narayana
Congress
Andhra Pradesh

More Telugu News