Vijayawada: పొత్తుపై చర్చలు.. జనసేన, లెఫ్ట్ పార్టీల బలాబలాల గురించి మాట్లాడుకున్నాం: నాదెండ్ల మనోహర్

  • మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు
  • మంచి వాతావరణంలో చర్చలు జరిగాయి
  • పవన్ కల్యాణ్ అధ్యక్షతన మరోసారి భేటీ అవుతాం

జనసేన, లెఫ్ట్ పార్టీల బలాబలాల గురించి మాట్లాడుకున్నామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన-లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగాయి. ఈ చర్చల్లో సీపీఎం తరపున మధు, సీపీఐ నుంచి రామకృష్ణ, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన మరోసారి భేటీ అవుతామని, సీట్ల సర్దుబాటు చేస్తామని చెప్పారు.

సీట్ల సర్దుబాటు పూర్తి చేసి ప్రచారానికి దిగుతాం

సీపీఎం మధు మాట్లాడుతూ, నాలుగు లేదా ఐదు రోజుల్లో సీట్ల ఎంపికపై భేటీ అవుతామని అన్నారు. టీడీపీ, వైసీపీని అడ్డుకోవాలంటే తమతో సాధ్యమని, తమ కూటమే ప్రత్యామ్నాయం అని చెప్పారు. సీట్ల సర్దుబాటు పూర్తి చేసి ఎన్నికల ప్రచారానికి దిగుతామని పేర్కొన్నారు.

టీడీపీ, వైసీపీవి విలువలు లేని రాజకీయాలు 


సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీ రాష్ట్రంలో డబ్బు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓట్ల తొలగింపు, డబ్బుతో అధికారంలోకి రావాలని చంద్రబాబు, జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నాయని దుమ్మెత్తిపోశారు. 

More Telugu News