Andhra Pradesh: ఏపీలో వ్యవస్థలను, మంత్రులను, ఎమ్మెల్యేలను చంద్రబాబు ముంచేస్తారు: మంత్రి తలసాని

  • డేటా చోరీ విషయమై టీడీపీ నేతలది పూటకో వైఖరి  
  • దొంగే ‘దొంగ’ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు
  • ఏపీ ప్రభుత్వం అక్కడి అధికారులను బలి చేయాలని చూస్తోంది

డేటా చోరీ కేసు విషయమై తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులకు అక్కడి మంత్రులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ మంత్రులు ఫిర్యాదు చేయడం దౌర్భాగ్యమని అన్నారు. ఏపీలో వ్యవస్థలను, మంత్రులను, ఎమ్మెల్యేలను చంద్రబాబు ముంచేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దొంగే ‘దొంగ’ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, కొన్ని సార్లు తమ డేటా చోరీకి గురైందని, ఇంకొన్నిసార్లు అలా జరగలేదంటూ టీడీపీ నేతలు పూటకో వైఖరితో ముందుకు సాగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం అక్కడి అధికారులను బలిచేయాలని చూస్తోందని ఆరోపించారు. చోరీకి గురైన డేటా, ఏపీ ప్రజలదని లోకానికి తెలుసని, చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్నారని, కొన్ని మీడియా సంస్థలు కూడా ఆయనకు వంత పాడుతున్నాయని నిప్పులు చెరిగారు. తెలంగాణలో 24 లక్షల ఓట్లను టీఆర్ఎస్ తొలగించి గెలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తలసాని మండిపడ్డారు.

More Telugu News