Nellore District: చెన్నై వెళుతున్నానని టీడీపీ నేతలకు చెప్పి... జగన్ వద్దకు వచ్చి చేరిన డాక్టర్ ఆదిశేషయ్య!

  • ఏపీలో అధికమైన ఫిరాయింపులు
  • ఆసక్తికరంగా ఆత్మకూరు రాజకీయం
  • ఆనం, మేకపాటి వ్యూహంతో పెరిగిన వైసీపీ బలం

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఫిరాయింపులు అధికమయ్యాయి. నెల్లూరు జిల్లాలో కీలకమైన ఆత్మకూరు నియోజకవర్గంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ తమ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ, తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య చేసిన పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధాన రాజకీయ పార్టీ నేతలు, తమ కార్యకర్తలు మరో పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వేళ, ఆదిశేషయ్య, టీడీపీకి హ్యాండిచ్చారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడిగానూ ఉన్న ఈయన పార్టీ మారవచ్చని కొన్ని రోజులుగా చర్చ సాగుతుండగా, ఈ క్రమంలో నెల్లూరులో జరిగిన సమర శంఖారావం సభలో అనూహ్యంగా ఆదిశేషయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

ఆదిశేషయ్యను వదులుకోవడం ఇష్టంలేని టీడీపీ, ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొల్లినేని కృష్ణయ్య, స్వయంగా ఆదిశేషయ్యను కలిసి చర్చించి, మీ డిమాండ్లను నెరవేరుస్తామని, పార్టీ మారవద్దని సూచించగా, ఆ సమయంలో తాను చెన్నై వెళ్లాల్సిన పనుందని, వెళ్లి వస్తానని చెప్పి, జగన్ వద్దకు ఆదిశేషయ్య వెళ్లిపోయారు. ఆదిశేషయ్య చేరిక వెనుక మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి తదితరుల వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి వ్యూహంతో ఆత్మకూరులో వైసీపీ బలం మరింతగా పెరిగిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News