Afjal Guru: నేను భారతీయుడినని గర్వంగా చెప్పుకుంటా: ఆసక్తికర విషయాలు వెల్లడించిన అఫ్జల్ గురు కుమారుడు

  • ఆధార్ కార్డు ఉన్నందుకు గర్వంగానూ ఉంది    
  • మా నాన్న మెడిసిన్‌ చదవాలనుకున్నారు
  • నాన్న చనిపోయాక అమ్మ చాలా జాగ్రత్తగా పెంచింది  
  • భద్రతా బలగాల నుంచి వేధింపులు ఎదురవలేదు    

భారత పార్లమెంట్‌పై దాడి కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురును గతంలో ఉరి తీసిన విషయం తెలిసిందే. అయితే, అతని తనయుడు మాత్రం ఇప్పుడు తాను భారతీయుడినని సగర్వంగా చెప్పుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదంపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ మీడియా ఆయన కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేశాయి. ఈ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అఫ్జల్ కుమారుడు 18 ఏళ్ల గాలిబ్.. కశ్మీర్లో తండ్రి భావజాలానికి దూరంగా సాధారణ పౌరుడిగా జీవిస్తున్నాడు. తాను భారతీయుడినని గర్వంగా చెప్పుకుంటానని.. తనకు ఆధార్ కార్డు ఉన్నందుకు సంతోషంగాను, గర్వంగానూ ఉందని అన్నాడు. తనకు మెడిసిన్ చదివి ప్రజలకు సేవ చేయాలని ఉందని తెలిపాడు.

‘కనీసం ఆధార్‌ కార్డు అయినా ఉంది. అందుకు సంతోషంగా ఉంది. పాస్‌పోర్టు కూడా వస్తే నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పుకుంటా. గతం తాలూకు తప్పుల నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. మా నాన్న మెడిసిన్‌ చదవాలనుకున్నారు. కానీ పూర్తి చేయలేకపోయారు. నాన్న కోరిక నేను నెరవేర్చాలనుకుంటున్నా. ప్రస్తుతం నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నా.

ఇక్కడి కాలేజీల్లోనే సీటు కోసం ట్రై చేస్తా. ఒకవేళ రాకపోతే విదేశాలకు వెళ్లాలనుకుంటున్నా. టర్కీలోని ఓ కాలేజీలో నాకు స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తారు. అయితే అక్కడకు వెళ్లాలంటే పాస్‌పోర్టు కావాలి. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ నన్ను చాలా జాగ్రత్తగా పెంచింది. ఎవరు ఏది చెప్పినా స్పందించొద్దు అని చెబుతూ వచ్చేది. నాకు మా అమ్మే ముఖ్యం. భద్రతా బలగాల నుంచి కూడా నాకు ఎలాంటి వేధింపులు ఎదురవలేదు. నేను చదువుకుంటానంటే వారు నన్ను ప్రోత్సహించారు కూడా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గాలిబ్.. తల్లి తబస్సుమ్, తాతయ్య గులామ్ అహ్మద్‌తో కలిసి ఉంటున్నాడు.

More Telugu News