Andhra Pradesh: ప్రతికూల పరిస్థితుల్లో నిలబడేవాడే నిజమైన నాయకుడు: పవన్ కల్యాణ్

  • నాయకులు కాదలచుకున్న వారు సమయం తీసుకోవాలి
  • అభిమానులు ఎంత బలమో, ఒక్కోసారి అంతే బలహీనత కూడా
  • కట్టలు తెంచుకున్న అభిమానం పాలపొంగులాంటిది కారాదు

నాయకులు కాదలచుకున్న వారు సమయం తీసుకోవాలని, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అంతా నాయకులు కావచ్చు కానీ, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడే వాడే తన దృష్టిలో నిజమైన నాయకుడని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జనసేన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీకి అభిమానులు ఎంత బలమో, ఒక్కోసారి అంతే బలహీనత కూడా అవుతున్నారని, కట్టలు తెంచుకున్న అభిమానం పాలపొంగులాంటిది కారాదని సూచించారు.

తాను హీరోగా ఎదిగిన తర్వాత కూడా 2009లో నాయకుడిని అయిపోవాలని ఆశపడలేదని, ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకోలేదన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తన కంటే అనుభవం ఉన్న వ్యక్తి ముందుకు వెళ్తుంటే వెనుక నుంచి తన వంతు తోడ్పాటు అందించానని, జనసైనికులు చేయాల్సింది కూడా అదేనని, ఎన్నో ఏళ్లుగా ఈ కుళ్లు రాజకీయాలను భరిస్తూ, సరైన ప్లాట్ ఫాం లేక ముందుకు రాలేకపోయిన జడ్జిలు, ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు, మేధావులు, విలువలు, అనుభవం ఉన్న నాయకులు తమ కోసం వచ్చారని అన్నారు. వారికి మనం వెనుక ఉండి మద్దతు ఇస్తేనే మనం కోరుకుంటున్న మార్పు సాధ్యపడుతుందని, అలా చేయలేకపోతే మన బలం ఒక చిన్న దారపుపోగే అవుతుందని అన్నారు.

More Telugu News