Andhra Pradesh: రవళి మృతదేహానికి ‘గాంధీ’లో పోస్ట్ మార్టం.. కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి ఎర్రబెల్లి!

  • పోస్ట్ మార్టం పూర్తి చేసిన వైద్యులు
  • రవళి ఆరోగ్యం మొదటినుంచి విషమంగానే ఉందన్న మంత్రి
  • ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ

ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడ్డ వరంగల్ కు చెందిన రవళి నిన్న చనిపోయిన సంగతి తెలిసిందే. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. ఈ నేపథ్యంలో రవళి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రవళి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రవళి కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన మొదటిరోజు నుంచే రవళి ఆరోగ్యం విషమంగా ఉందని చెప్పారు. ఆమెకు సంబంధించిన వైద్య ఖర్చులను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని వెల్లడించారు. ప్రేమోన్మాది అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

మరోవైపు గాంధీ ఆసుపత్రి వర్గాలు రవళి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశాయి. దీంతో వరంగల్ లోని స్వగ్రామం రామచంద్రపురానికి భౌతికకాయాన్ని తరలించారు. గత నెల 27న వరంగల్ లోని వాగ్దేవీ కాలేజీకి వెళుతున్న రవళిపై అన్వేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలినగాయాలు కావడంతో రవళి చనిపోయింది.

More Telugu News