Andhra Pradesh: అజ్ఞాతంలోకి ‘ఐటీ గ్రిడ్’ డైరెక్టర్ అశోక్.. ప్రత్యేక బృందాలతో జల్లెడ పడుతున్న సైబరాబాద్ పోలీసులు!

  • తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన అశోక్
  • పిటిషన్ ను కోర్టు కొట్టేయడంతో అజ్ఞాతంలోకి
  • ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సైబరాబాద్ పోలీసుల మీడియా సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణమైన ‘ఐటీ గ్రిడ్’ సంస్థ డైరెక్టర్ అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. తమ ఉద్యోగులు నలుగురు కనిపించడం లేదని అశోక్ నిన్న తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను ఈరోజు ఇంటివద్దే విచారించిన జస్టిస్ చౌహాన్.. కేసు విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నలుగురు కంపెనీ ఉద్యోగులను విడిచిపెట్టినట్లు తెలంగాణ పోలీసులు సైతం ప్రకటించారు.

ఈ నేపథ్యంలో అశోక్ ను ప్రశ్నించేందుకు పోలీసులు యత్నించగా, ఆయన అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి  హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కావలి, బెంగళూరులో గాలింపును ముమ్మరం చేశారు. మరోవైపు ఈ కేసులో ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

More Telugu News