KTR: రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నారు?: కేటీఆర్

  • ఎమ్మెల్యేలను కొంటున్నారన్న కాంగ్రెస్
  • తీవ్రంగా స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  • గతంలో ఎవరిని ఎంతకు కొన్నారని ప్రశ్నలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పు చేసింది చాలక తమపైనే విమర్శలు గుప్పిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సంక్షేమానికి, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మాత్రమే తమ పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. తామేమీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి రావాలని ప్రలోభ పెట్టడం లేదని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.

ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించిన ఆయన, తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్ రెడ్డిని ఎన్ని కోట్లు ఇచ్చి కొన్నారని ప్రశ్నించారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకున్నప్పుడు ఎంత డబ్బు ఇచ్చారో చెప్పి, ఆపై తమను ప్రశ్నించాలని సవాల్ విసిరారు.

"కాంగ్రెస్‌ నేతలవి దురహంకార మాటలు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ప్రజల్లో రాజకీయ వ్యవస్థను మనమే దిగజారుస్తున్నాం. కాంగ్రెస్‌ లో చేవ చచ్చిందని స్వయంగా రాజగోపాల్‌ రెడ్డి చెప్పారు. మాదారి మేమే వెతుక్కుంటామని ఆయనే అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పార్టీ మారినప్పుడు ఇదే ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ మారారు. టీఆర్‌ఎస్‌ లో గెలిచిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ లో చేర్చుకున్నప్పుడు ఎంతకు కొన్నారు?" అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

More Telugu News