Priyanka Chopra: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు వ్యతిరేకంగా పాక్‌లో నిరసనలు

  • పాక్ భూభాగంలో భారత దాడులను ప్రశంసించిన ప్రియాంక చోప్రా
  • యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంటూ ఆ ట్వీట్లేంటంటూ మండిపాటు
  • ఆమెను తొలగించాలంటూ ఆన్‌లైన్ పిటిషన్

బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రాకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో నిరసనలు ఉద్ధృతమయ్యాయి. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్న ఆమెను తక్షణం తప్పించాలంటూ పాకిస్థానీలు ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు చేశారు. ఐక్యరాజ్య సమితి, యూనిసెఫ్‌ను ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇటీవల భారత వాయుసేన పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించడాన్ని ప్రియాంక ప్రశంసించింది. ‘జై హింద్’ అంటూ ట్వీట్ చేసింది. భారత దాడులను ప్రశంసించిన ప్రియాంకపై పాకిస్థానీలు మండిపడుతున్నారు. యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంటూ ఈ ట్వీట్లేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ సంస్థకు రాయబారిగా ఉన్నప్పుడు తటస్థంగా ఉండాలన్న కనీస జ్ఞానం కూడా లేకుండా రెచ్చగొట్టేలా ఆ ట్వీట్లు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా ఐరాస, యూనిసెఫ్‌ను ట్యాగ్ చేస్తూ ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే ఆమెను రాయబారిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

‘‘రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం జరిగితే అది వినాశనానికి దారితీస్తుంది. బోల్డంత మంది ప్రాణాలు కోల్పోతారు. యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా తటస్థంగా ఉండాలి. శాంతియుతంగా వ్యవహరించాలి. కానీ ఆమె ట్వీట్ ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రియాంక ఇక ఎంతమాత్రమూ యూనిసెఫ్ అంబాసిడర్‌గా  ఉండడానికి అర్హురాలు కాదు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పిటిషన్‌పై వేలాదిమంది సంతకాలు చేస్తున్నారు.

More Telugu News