Arun Jaitly: మన ప్రతిపక్ష నేతలు కొత్త బాలాకోట్ ను కనిపెట్టారు: ఎద్దేవా చేసిన అరుణ్ జైట్లీ

  • జమ్మూకశ్మీర్లో ఉన్నది బాలా కోటే
  • పాక్ లో ఉన్నది బాలాకోట్
  • ఈ రెండింటికి తేడా తెలియనివాళ్లు మన విపక్ష నేతలు

వింగ్ కమాండర్ అభినందన్ ను విజయవంతంగా స్వదేశానికి రప్పించిన నేపథ్యంలో సమయం, సందర్భం చూసి విపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. బీజేపీకి మాంచి మైలేజ్ వస్తున్న తరుణంలో విపక్షాలను మరింత ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేశారు. పాకిస్థాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో మనవాళ్లు దాడి చేస్తే... దాన్ని జమ్మూకశ్మీర్ లోని బాలా కోటే ప్రాంతంగా పొరబడిన ఘనులు మన విపక్ష నేతలు అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో శనివారం 'మన్ కీ బాత్... ఏ సోషల్ రివల్యూషన్ ఆన్ రేడియా' పుస్తకావిష్కరణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లో ఉండే బాలాకోట్ లో ఐఏఎఫ్ విమానాలు దాడిచేశాయని, అయితే దీనిపై పూర్తి సమాచారం రాకముందే బాలాకోటే అనే ప్రాంతం ఎల్వోసీకి సమీపంలో ఉందని, అక్కడ వాయుసేన దాడులు నిర్వహించిందని విపక్షాలు హడావుడి చేశాయని ఆరోపించారు. బాలా కోటే అనే ప్రాంతం భారత్ లోనే ఉందని, అది కూడా జమ్మూకశ్మీర్లోనే ఉందని వారు గుర్తించలేకపోయారని విమర్శించారు. అయినా మన విమానాలు మనదేశంలోని ప్రాంతంపైనే ఎందుకు దాడిచేస్తాయని జైట్లీ ప్రశ్నించారు. మన విపక్ష అతివాదులు కొత్తగా బాలాకోట్ ప్రాంతాన్ని కనిపెట్టారంటూ ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News