Andhra Pradesh: పాకిస్థాన్ తో యుద్ధంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన జనసేన పార్టీ!

  • జాతీయ, పాక్ మీడియాలో ప్రముఖంగా  పవన్ కామెంట్లు
  • భారత్-పాక్ యుద్దం రాబోతోందని రెండేళ్ల క్రితమే తెలుసున్న పవన్
  • పవన్ మాటలను వక్రీకరించవద్దన్న జనసేన

భారత్-పాకిస్థాన్ ల మధ్య యుద్ధం రాబోతోందంటూ రెండేళ్ల క్రితమే కొందరు బీజేపీ నేతలు చెప్పారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ప్రస్తుతం యుద్ధానికి తెరతీసే పరిస్థితులు నెలకొని ఉన్నాయని పవన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మాటలు జాతీయ మీడియాతో పాటు పాకిస్థాన్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. దీంతో ఈ వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించింది.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన జాతీయ మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని కోరింది. ఈ సందర్భంగా గత నెల 28న ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..‘యుద్ధం వస్తుందని పాకిస్థాన్ వాళ్లు మాట్లాడుకుంటుంటే నేనేమన్నా విన్నానా? అంతర్జాతీయ సంస్థ లేమన్ బ్రదర్స్ కుప్పకూలిపోయిన నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని కొందరు నిపుణులు ముందుగానే అంచనా వేశారు.

భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్దం రాబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఇంటర్నెట్ లో కథనాలు సైతం అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఇరుదేశాల మధ్య యుద్ధం రాబోతోందన్నది నా అంచనా కాదు. కొందరు రాజకీయ పరిశీలకుల అంచనా మాత్రమే’ అని జనసేనాని చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

More Telugu News