India: అల్లాహ్ కు చెందిన 99 పేర్లలో ఎక్కడా హింస లేదు.. రుగ్వేదంలో దేవుడు ఒక్కడేనని చెప్పారు!: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్

  • ఉగ్రమూకలకు ఆర్థిక సాయం, మద్దతు నిలిపివేయాలి
  • భారత్ నుంచి 130 కోట్ల మంది అభినందనలు తీసుకొచ్చా
  • ఓఐసీ సదస్సులో ప్రసంగించిన భారత విదేశాంగ మంత్రి

ఉగ్రమూకలకు అండదండలు, ఆర్థిక సాయాన్ని అందించడం నిలిపివేయాలని ప్రపంచదేశాలకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం కారణంగా చాలా దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని వ్యాఖ్యానించారు. అరబ్-ముస్లిం దేశాలు యూఏఈలోని అబుదాబిలో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సదస్సుకు సుష్మ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుష్మ, దాయాది దేశం పాకిస్థాన్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.

ఈ సదస్సుకు తాను 130 కోట్ల భారతీయుల అభినందనలు, 18.5 కోట్ల భారతీయ ముస్లిం సోదరసోదరీమణుల శుభాకాంక్షలు తీసుకొచ్చానని సుష్మ తెలిపారు. ప్రపంచంలోని భిన్నమైన దేశాల్లో భారత్ ఒకటనీ, అన్నిమతాల ప్రజలు ఇక్కడ సోదరభావంతో, సామరస్యంగా జీవిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదం ఏ మతానికి సంబంధించినది కాదని సుష్మ స్పష్టం చేశారు.

ప్రపంచదేశాల పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉండాలే తప్ప మతానికి కాదని వ్యాఖ్యానించారు. ఇస్లాం శాంతిని ప్రబోధిస్తుందనీ, అల్లాహ్ కు ఉన్న 99 పేర్లలో ఎందులోనూ హింస లేదని పేర్కొన్నారు. రుగ్వేదం ప్రకారం దేవుడు ఒక్కడేననీ, కానీ ఆయన్ను ప్రజలు రకరకాలుగా పూజిస్తారని చెప్పారు. ప్రపంచ స్థిరత్వం, శాంతి, సామరస్యం, ఆర్థిక పురోగతి కోసం ఓఐసీ చేస్తున్న ప్రయత్నానికి భారత్ మద్దతు ఇస్తున్నట్లు సుష్మా స్వరాజ్ తెలిపారు.

More Telugu News