India: భారత్ లోకి ఉగ్రవాదులను పంపిన పాక్.. ఇద్దరిని కాల్చిచంపిన భద్రతాదళాలు!

  • జమ్మూకశ్మీర్ లోని కుప్వారాలో ఘటన
  • కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్
  • భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం

భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గకుండానే దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడింది. కశ్మీర్ లో అశాంతిని రెచ్చగొట్టేందుకు ఉగ్రవాదులను పంపింది. అయితే నిఘావర్గాల పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు, ఉగ్రవాదులను హతమార్చాయి. జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి.

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దు నుంచి కుప్వారాలోకి చొరబడ్డారని నిఘావర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. వీరు ప్రస్తుతం హంద్వారా ప్రాంతంలో నక్కిఉన్నట్లు వెల్లడించాయి. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీల సంయుక్త బృందం ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపును ప్రారంభించింది. అయితే బలగాల కదలికలను గుర్తించిన ఉగ్రవాదులు.. కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి తప్పించునేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించారు.

ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా, ఘటనాస్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. భద్రతాబలగాల కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదుల వివరాలపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. వీరంతా పాకిస్థాన్ నుంచి భారత్ లోకి చొరబడ్డారని తెలిపారు. ఎన్ కౌంటర్ లో తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

More Telugu News