USA: భారత్‌కు అనూహ్య మద్దతు.. జైషేపై దాడిని సమర్థించిన అమెరికా

  • పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి  సమంజసమే
  • ఉగ్రవాదాన్ని ఎంతకాలమో భరించలేరు
  • అజిత్ ధోవల్‌కు అమెరికా కార్యదర్శి ఫోన్

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. భారత్ దాడి చేసింది ఉగ్రవాద శిబిరాలనే అయినా, పాక్ మాత్రం అవమాన భారంతో రగిలిపోతోంది. ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లోకి చొచ్చుకొచ్చిన పాక్ యుద్ధ విమానాలను భారత వాయసేన తరిమి కొట్టింది. ఈ ఘటన తర్వాత దాయాది దేశాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.

పొరుగు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు రంగంలోకి దిగిన అమెరికా ఇరు దేశాలకు ఫోన్ చేసి ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం చేయాలని, మిలటరీ చర్యలకు అడ్డుకట్ట వేయాలని సూచించింది.

అయితే, గత రాత్రి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఫోన్ చేసిన అమెరికా కార్యదర్శి మైక్ పోంపెయో.. పాక్ భూభాగంలోని ఉగ్రశిబిరాలపై భారత్ దాడులను సమర్థించారు. జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు చేయాలన్న భారత్ నిర్ణయం సరైనదేనని పేర్కొన్నారు.

ఉగ్రవాదాన్ని ఏ దేశమూ సహించదని, ఉగ్రదాడులను భరిస్తూ ఏ దేశమూ ఇంకెంత కాలమూ సంయమనం పాటించలేదని ఈ సందర్భంగా మైక్ పేర్కొన్నారు. కాగా, మరోవైపు పుల్వామా దాడికి సూత్రధారి అయిన జైషే చీఫ్ మసూద్ అజర్‌పై నిషేధం విధించాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని కోరాయి.

More Telugu News