Karnataka: ఎన్ని విమానాలు పోతే అన్ని ఎక్కువ లోక్ సభ సీట్లు వస్తాయి: యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు!

  • మరోసారి వివాదాన్ని కొని తెచ్చుకున్న యడ్యూరప్ప
  • వాతావరణం బీజేపీకి అనుకూలం
  • యువత మోదీ వెంట ఉన్నారన్న కర్ణాటక మాజీ సీఎం

కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప మరోసారి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో, ఎన్ని విమానాలు పాక్ లోకి వెళితే, అన్ని ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన అనడం విమర్శలకు దారితీసింది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 28 వరకూ సీట్లను గెలుచుకుంటుందని చిత్రదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.

 "వాతావరణం రోజురోజుకూ మారిపోతోంది. అది బీజేపీకి అనుకూలంగా మారుతోంది. ఉగ్రవాదుల స్థావరాలపై భారత విమానాలు దాడి చేసిన తరువాత దేశవ్యాప్తంగా గాలులన్నీ నరేంద్ర మోదీకి అనుకూలంగా వీస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అధిక సీట్లు మనకే వస్తాయి. యువత మొత్తం పార్టీ వెంట ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. యడ్యూరప్ప వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తూ, సైన్యం త్యాగాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని ఆరోపించింది.

More Telugu News