pregnent: గర్భిణులు సౌందర్య సాధనాలు వాడితే పుట్టే పిల్లలకు పెనుముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి!

  • చిన్నారుల్లో తగ్గిపోతున్న చురుకుదనం
  • సథాలేట్స్ అనే రసాయనాలే కారణమన్న నిపుణులు
  • ఆహార నిల్వకు ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని సూచన

సాధారణంగా గర్భిణులను జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న సమస్యలకు మందులు వాడొద్దని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే కడుపులో ఉండే చిన్నారిపై ఈ మందులు తీవ్ర ప్రభావం చూపుతాయి. తాజాగా ఈ జాబితాలో లిపిస్టిక్‌లు, మాయిశ్చరైజర్లు, ఇతర సౌందర్య సాధనాలు చేరాయి. గర్భిణులు వీటిని వాడితే పుట్టబోయే పిల్లల్లో శారీరక కదలికలు తక్కువవుతాయని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా సౌందర్య సాధనాల్లో సథాలేట్స్‌ అనే రసాయనాలుంటాయి. గర్భిణులు వీటిని వినియోగిస్తే, పుట్టే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం రంగంలోకి దిగింది. 11 ఏళ్ల వయసున్న బాలబాలికల్లో శరీర కదలికలకు సంబంధించి ‘బాట్‌-2’ పరీక్షలను నిర్వహించింది. వీరిలో కొందరు చురుగ్గా లేకపోవడం, మరికొందరు తమ పనులను తామే చేసుకోలేకపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయమై ఆరా తీయగా ఈ పిల్లల తల్లులు గర్భవతులుగా ఉన్న సమయంలో సౌందర్య సాధనాలను విరివిగా వాడినట్లు తేలింది.

ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఫాక్టర్‌-లిత్వాక్‌ మాట్లాడుతూ..‘గర్భిణులు వాడే రసాయనాల కారణంగా వారి పిల్లలు యుక్తవయసుకు వచ్చే సమయంలో చాలా ఇబ్బందులకు గురవుతారు. చురుగ్గా కదల్లేరు. అంతేకాకుండా ఆత్మన్యూనత, ఆందోళన, వ్యాకులత, తదితర సమస్యలు వారిని చుట్టుముట్టే ప్రమాదముంది. తల్లులు కాబోయేవారు సౌందర్య సాధనాలతో పాటు ఆహారం, పానీయాలను నిల్వచేసేందుకు ప్లాస్టిక్‌ వస్తువులను వాడకపోవడమే మంచిది’ అని సూచించారు.

More Telugu News