Tamilnadu: ఈ పామేనండీ నన్ను కరిచింది.. సజీవంగా ఆసుపత్రికి పట్టుకొచ్చిన 87 ఏళ్ల రైతు!

  • తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘటన
  • పామును చూపి వైద్యం చేయించుకున్న రైతు
  • రైతన్న సమయస్ఫూర్తిని ప్రశంసించిన వైద్యులు

సాధారణంగా పాము కాటేస్తే చాలామంది భయపడిపోతారు. కానీ ఓ పెద్దాయన మాత్రం చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు. తనను కాటేసిన పామును సజీవంగా పట్టుకొచ్చి వైద్యం చేయించుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

కడలూరులోని విరుదాచలం సమీపంలో చిన్నకండియాంగప్పని గ్రామంలో రంగనాథన్‌ (87) అనే రైతు ఉంటున్నారు. గత బుధవారం రాత్రి పొలం నుంచి వస్తుండగా రంగనాథన్ ను ఓ పాము కాటేసింది. వేరేవాళ్లు అయితే భయంతో అక్కడి నుంచి పరుగులు తీసేవారే. కానీ రంగనాథన్ చాకచక్యంగా తన దగ్గరున్న కర్రతో పామును సజీవంగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని తీసుకుని ఆసుపత్రికి వచ్చారు. దీంతో పామును చూసిన రోగుల బంధువులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.

కాగా, తనను ఈ పామే కాటేసిందని వైద్యులకు చెప్పి రంగనాథన్.. వెంటనే చికిత్స చేయించుకున్నారు. అనంతరం పామును పక్కనే ఉన్న అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. సాధారణంగా ఏ పాము కాటేసిందో రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవడానికి సమయం పడుతుంది. అప్పటిలోగా రోగి ఆరోగ్యం మరింతగా క్షీణించే ప్రమాదం ఉంది.

ఈ విషయం తెలిసిన రంగనాథన్ తనను కాటేసిన పామును ఆసుపత్రికి తీసుకురావడంతో నేరుగా ఆ పాము విషానికి విరుగుడును వైద్యులు అందించారు. కాగా,పాము కాటేసినప్పటికీ భయపడకుండా రంగనాథన్ చూపిన సమయస్ఫూర్తిని వైద్యులు ప్రశంసించారు.

More Telugu News