Narendra Modi: పుల్వామా దాడి తర్వాత మోదీ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదట!

  • కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం
  • ప్రధాని చలించిపోయారు
  • మోదీ కోసం రంగంలోకి దిగిన ప్రభుత్వ వర్గాలు

ఓవైపు పుల్వామా దాడితో యావత్ భారతదేశం రగిలిపోతున్న క్షణాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిల్మ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారంటూ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపణల దాడిచేస్తుండడం తెలిసిందే. దీనికి కౌంటర్ గా ప్రభుత్వ వర్గాలు రంగంలోకి దిగాయి. పుల్వామా దాడి తర్వాత ప్రధాని మోదీ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదని స్పష్టం చేశాయి. స్వీయప్రచారం కోసం మోదీ టెలివిజన్ ఫిల్మ్ రూపకల్పనలో తలమునకలుగా ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రచారం చేయడం అర్థరహితమని పేర్కొన్నాయి. పుల్వామా వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగిందని తెలిసినప్పటి నుంచి ప్రధాని ఏమీ తినలేదని తెలిపాయి.

అంతకుముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా ప్రధానిపై ఆరోపణల వర్షం కురిపించారు. అధికార దాహంతో మోదీ తపించిపోతున్నారని, ఓ ప్రధానిగా తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద ఫిల్మ్ షూటింగ్ లో మునిగిపోయారని విమర్శించారు. ఉగ్రదాడి గురించి సమాచారం తెలిసిన తర్వాత కూడా జాతీయవాదినని చెప్పుకునే ప్రధాని ఈ విధంగా ప్రవర్తించడం దారుణమంటూ మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి మధ్యాహ్నం తర్వాత 3.10 గంటలకు జరిగితే ప్రధాని రాత్రి 7 గంటల వరకు షూటింగ్ లోనే ఉన్నారంటూ ఆరోపించారు సూర్జేవాలా. అయితే ప్రధాని సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యంగా షెడ్యూల్ ప్రారంభించారని, రుద్రపూర్ లో ఓ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉన్నా పుల్వామా దాడి కారణంగా వాయిదా వేసుకుని తదుపరి కార్యాచరణలో బిజీ అయ్యారని వెల్లడించాయి.

More Telugu News