Pakistan: ​ జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థపై నిషేధం విధించిన పాకిస్థాన్

  • అనుబంధ సంస్థ ఫలా-ఏ- ఇన్సానియత్ పైనా నిషేధం
  • ఉగ్రవాదంపై ఉక్కుపాదం అంటూ ప్రకటన
  • ఇమ్రాన్ సర్కారు కంటితుడుపు చర్యలు

పుల్వామా ఉగ్రదాడి విషయంలో అంతర్జాతీయ సమాజం తనను వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ కంటితుడుపు చర్యలకు దిగింది. ఇప్పటికే కఠిన ఆంక్షలు ఎదుర్కొంటున్న జమాత్-ఉద్-దవా ఉగ్రవాద సంస్థపై నిషేధం విధిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 2008 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ మానసపుత్రికే జమాత్-ఉద్-దవా. దీనిపైనే కాకుండా దీనికి అనుబంధంగా ఉన్న ఛారిటీ సంస్థ ఫలా-ఏ-ఇన్సానియత్ పైనా నిషేధాజ్ఞలు విధించింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. ఈ మేరకు పాకిస్థాన్ దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన వెలిబుచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయంలో నిర్వహించిన జాతీయ భద్రత కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రెండు సంస్థలను నిషేధిత సంస్థలుగా గుర్తించినట్టు వెల్లడించారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కీలక మంత్రులతో పాటు పాక్ సాయుధ బలగాల చీఫ్ లు కూడా హాజరయ్యారు. గతకొంతకాలంగా పాకిస్థాన్ ప్రభుత్వం జమాత్-ఉద్-దవా, ఫలా-ఏ-ఇన్సానియత్ ఫౌండేషన్ కార్యకలాపాలను పరిశీలనలో ఉంచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా గుర్తింపు ఉన్న లష్కరే తోయిబాపై నిషేధం విధించడంతో దానిపేరును జమాత్ ఉద్ దవాగా మార్చారు. ఇప్పుడు దాన్ని కూడా నిషేధించిన నేపథ్యంలో ఉగ్రవాద విషసర్పం హఫీజ్ సయీద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్న దానిపై ఆసక్తి నెలకొంది.

More Telugu News