priyanka gandhi: తన టీమ్ మెంబర్ ను తొలగించమన్న ప్రియాంక.. వేటు వేసిన రాహుల్ గాంధీ

  • యూపీ టీమ్ లో సెక్రటరీ బాధ్యతల నుంచి కుమార్ ఆశిష్ తొలగింపు
  • ఆయన స్థానంలో సచిన్ నాయక్ నియామకం
  • ఆశిష్ పై పరీక్షాపత్రాల లీకేజీ ఆరోపణలు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలతో పాటు తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను కూడా రాహుల్ కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రియాంక టీమ్ లో భాగంగా పార్టీ సెక్రటరీగా కుమార్ ఆశిష్ ను గత మంగళవారం నియమించారు.

 అయితే, ఆ పదవి నుంచి ఆశిష్ ను తొలగించాలని ప్రియాంక కోరడంతో... అతనిపై రాహుల్ వేటు వేశారు. 2005లో బీహార్ లో పరీక్షాపత్రాలు లీక్ అయిన కేసులో కుమార్ ఆశిష్ నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, మళ్లీ కాంగ్రెస్ లో చేరిన ఆయన... బీహార్ ఎన్నికల్లో పోటీ చేశారు.

ఈ పేపర్ లీకేజీ అంశం ప్రియాంక దృష్టికి వెళ్లడంతో... అతని స్థానంలో మరొకరిని నియమించాలని రాహుల్ ను కోరారు. దీంతో, కుమార్ ఆశిష్ స్థానంలో సచిన్ నాయక్ ను నియమించారు. ఉత్తరప్రదేశ్ టీమ్ లో ఆరుగురు సెక్రటరీలు ఉన్నారు. వీరిలో ముగ్గురు ప్రియాంక కింద, మరో ముగ్గురు జ్యోతిరాదిత్య సింధియా కింద ఉన్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ పార్టీ బాధ్యతలను సింధియాకు రాహుల్ అప్పగించిన విషయం తెలిసిందే.

More Telugu News