Kakinada: హామీ ఇవ్వకుంటే వైసీపీలోకి... నిర్ణయానికి వచ్చేసిన టీడీపీ ఎంపీ తోట నర్సింహం?

  • తన భార్య వాణికి జగ్గంపేట టికెట్ కోరుతున్న తోట నర్సింహం  
  • ఇప్పటికే జ్యోతుల నెహ్రూకు టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ
  • వైసీపీలో చేరే ఆలోచనతోనే ఈ డిమాండ్ చేస్తున్నారని టీడీపీ విమర్శలు

రానున్న ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా ఎన్నికల బరిలోకి దిగడం లేదని ఇప్పటికే వెల్లడించిన కాకినాడ ఎంపీ తోట నర్సింహం, ఎన్నికల్లో తన భార్య వాణికి మాత్రం టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేసిన ఆయన, కీలకమైన జగ్గంపేట నియోజకవర్గాన్ని అడుగుతున్నారని సమాచారం.

అయితే, జగ్గంపేట టికెట్ ను వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి, ఆపై టీడీపీలోకి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూకే టీడీపీ ఖరారు చేసినట్టు తెలుస్తుండగా, ఈ విషయం తెలిసి కూడా నర్సింహం ఇదే స్థానాన్ని ఆశించడం వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన, కారణం చెప్పుకోవడానికే జగ్గంపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

2014 ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగానూ పనిచేసిన ఆయన, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచారు. తాజాగా, చలమలశెట్టి సునీల్ తెలుగుదేశంలో చేరనుండటంతో తోట నర్సింహానికి సీటు లభించే పరిస్థితి లేదు. టీడీపీలో తన భార్యకైనా టికెట్ లభిస్తే, పార్టీలో ఉండాలని, లేకుంటే మరో పార్టీలోకి మారాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక తోట నర్సింహం 'ఫ్యాన్' కిందకు చేరినా, జగ్గంపేట టికెట్ హామీ లభించడం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే జ్యోతుల చంటిబాబు ఆ నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా చురుకుగా ఉన్నారు. టికెట్ కూడా ఆయనకేనని జగన్ ఖరారు చేసినట్టు వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక తోట నర్సింహం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరికొన్ని రోజుల్లో తేలనుంది.

More Telugu News