Pakistan: భారత్ ఒత్తిడిని బేఖాతరు చేస్తూ పాకిస్థాన్ లో అడుగుపెట్టిన సౌదీ యువరాజు

  • రెండ్రోజుల పర్యటన కోసం ఇస్లామాబాద్ చేరిక
  • ప్యాకేజి ప్రకటిస్తాడని ఆశపడుతున్న పాక్
  • భారత్ నిరసన తెలిపే అవకాశం

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ ఒత్తిడిని కూడా లెక్కచేయకుండా పాకిస్థాన్ లో అడుగుపెట్టారు. భారత్ లో సాయుధ బలగాలపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ ను వేలెత్తి చూపిస్తోంది. ఈ విషయంలో పాక్ ను ఏకాకిని చేయాలని భారత్ దౌత్య మార్గాల ద్వారా ముమ్మరంగా పోరాడుతోంది. సౌదీ యువరాజును కూడా పాక్ పర్యటన రద్దు చేసుకునేలా ప్రభావితం చేయాలని చివరికంటా ప్రయత్నించింది. కానీ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ ప్రయత్నాలను బేఖాతరు చేస్తూ రెండ్రోజుల పర్యటన కోసం ఆదివారం ఇస్లామాబాద్ చేరుకున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ ఖమర్ బాజ్వా ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఘనస్వాగతం పలికారు. 21 తుపాకులతో గౌరవ వందనం స్వీకరించిన సౌదీ ప్రిన్స్ తనకు లభిస్తున్న అతిథి మర్యాదల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఓవైపు ఆంక్షలతో సతమతమవుతున్న పాకిస్థాన్ కు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆశాదీపంలా కనిపిస్తున్నాడు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య సుమారు 15 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పాకిస్థాన్ లో చమురుశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసే విషయం ఈ పర్యటన ద్వారా ఓ కొలిక్కి రానుంది. అయితే, పుల్వామా ఉగ్రదాడికి పాక్ వెన్నుదన్నుగా నిలిచిందని భావిస్తున్న భారత్ సౌదీ యువరాజు పర్యటన పట్ల నిరసన తెలిపే అవకాశాలున్నాయి.

More Telugu News