vande bharat express: బ్రేకింగ్‌ వ్యవస్థ ఫెయిల్యూర్‌తో మధ్యలో నిలిచిన ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’!

  • వారణాసి నుంచి వస్తుండగా గేదెను ఢీకొట్టిన  రైలు
  • చక్రాల్లోకి గేదె కళేబరం వెళ్లడంతో నిలిచిన వైనం
  • మూడు గంటలు శ్రమించి సమస్య పరిష్కరించిన ఇంజనీర్లు

స్వదేశీ పరిజ్ఞానంతో మన ఇంజనీర్లు రూపొందించిన ఇంజన్‌ రహిత సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రెండో రోజు బ్రేక్‌డౌన్‌ అయింది. బ్రేకింగ్‌ వ్యవస్థలో లోపం తలెత్తడంతో తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో రైలు నిలిచిపోయింది. ఢిల్లీ వారణాసి మధ్య తిరిగే ఈ రైలును శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

నేటి ఉదయం 5.30 గంటల సమయంలో వారణాసి నుంచి ఢిల్లీ వస్తుండగా రైలులోని నాలుగు కోచ్‌లలో బ్రేకు పట్టేయడంతో పెద్ద శబ్దం వచ్చింది. సాంకేతిక సమస్యను గుర్తించిన లోకో పైలెట్ ప్రయాణికులను మరో రైలులో తరలించారు. రైలు ఓ గేదెను ఢీకొట్టడంతో చివరి బోగీ దెబ్బతింది. బోగీ చక్రాలకు గేదె మృతదేహం చుట్టుకోవడం వల్లే బ్రేకులు పట్టేశాయని గుర్తించిన లోకోపైలెట్లు రైలును నిలిపివేశారు.

దాదాపు మూడు గంటలపాటు కష్టపడి సమస్యను పరిష్కరించడంతో తిరిగి రైలు బయలుదేరింది. గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు ఢిల్లీ, వారణాసి మధ్య దూరాన్ని 9.40 గంటల్లో పూర్తిచేస్తుంది. దేశీయంగా తయారు చేసిన ఈ రైలు సమర్థవంతంగా పనిచేస్తోందని నిర్థారించుకున్న అనంతరం రైల్వేశాఖ మరో వంద రైళ్ల తయారీకి ఆర్డర్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

More Telugu News