spicejet: విమానాశ్రయంలో రన్‌ వేపై బైఠాయించి ప్రయాణికుల నిరసన

  • శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘటన
  • మరమ్మతుల పేరిట మూడు గంటలు విమానంలోనే
  • అసహనంతో ఆగ్రహం

విమాన ప్రయాణికులు రన్‌ వేపై బైఠాయించి నిరసన తెలిపిన అరుదైన ఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, మరమ్మతు నిర్వహిస్తున్నామని చెప్పి ప్రయాణికులను మూడు గంటలపాటు విమానంలోనే కూర్చోబెట్టడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల మేరకు...అహ్మదాబాద్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానం ఒకటి బుధవారం ఉదయం 8 గంటలకు ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరింది. రన్‌ వేపై స్పీడందుకుని టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో పైలెట్‌ సాంకేతిక సమస్యను గుర్తించాడు. వెంటనే విమానాన్ని వెనక్కితిప్పి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

చిన్నపాటి సమస్యే అనుకుని ప్రయాణికులను విమానంలోనే కూర్చోబెట్టి సాంకేతిక సిబ్బంది మరమ్మతులు ప్రారంభించారు. మూడు గంటలైనా మరమ్మతులు కొలిక్కిరాకపోవడం, అసలు విమానం బయలుదేరుతుందా? లేదా? అన్నది తెలిసే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికుల్లో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో స్పైస్‌జెట్‌ విమానం సిబ్బందిని నిలదీశారు.

వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో కిందికి దిగి రన్‌ వేపై బైఠాయించారు. ఆందోళన తీవ్రం కావడం గుర్తించిన ఎయిర్‌లైన్స్‌ అధికారులు తక్షణం పరిష్కార మార్గాలను చూశారు. వీలైనంత వేగంగా మరమ్మతులు పూర్తిచేశారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విమానం టేకాఫ్‌ అయ్యి అహ్మదాబాద్‌ వైపు ఎగిరింది.

More Telugu News