Karnataka: కొనసాగుతున్న బీజేపీ ప్రలోభాలు... కర్ణాటకలో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తే రూ. 10 కోట్లు, మినిస్టర్ పదవి!

  • తాజాగా మరో ఆడియో టేప్ వెలుగులోకి
  • 15 మంది రాజీనామా చేయాలని కోరిన యడ్యూరప్ప
  • ఆపై కథ పెద్దలు నడిపిస్తారని భరోసా

కర్ణాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్ - కాంగ్రెస్ కూటమిని ఎలాగైనా దించాలన్న ఉద్దేశంతో ప్రలోభాలకు దిగిన బీజేపీ నేతల ఆడియోలు ఇప్పుడు రాష్ట్రంలో కాక రేపుతున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్యేలను యడ్యూరప్ప ప్రలోభ పెడుతున్న తాజా ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8న ఓ ఆడియోను సీఎం కుమారస్వామి విడుదల చేయగా, ఈ తాజా టేపును జేడీఎస్ వర్గాలు బయటపెట్టాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రూ. 10 కోట్లు ఇవ్వడంతో పాటు, ఆపై టికెట్ ఇచ్చి గెలిపించుకుని మంత్రి పదవి ఇస్తానని యడ్యూరప్ప ఆఫర్ చేస్తున్నట్టుగా ఇందులో ఉంది.

ఎమ్మెల్యే శరణగౌడతో మాటలకు దిగిన యడ్యూరప్ప, తొలుత మీ నాన్నతో మాట్లాడి రాజీనామాకు ఒప్పించాలని, ముంబైకి వెళ్లి, 15 మంది ఎమ్మెల్యేలను కలుపుకుని ఒకేసారి రాజీనామా చేస్తే, తొలుత ఇంటికి రూ. 20 కోట్లు పంపుతామని ఆయన చెప్పినట్టుగా వినిపిస్తోంది. ఆర్థిక వ్యవహారాలను తన కుమారుడు విజయేంద్ర చూసుకుంటాడని, లోక్ సభ ఎన్నికల తరువాత జేడీఎస్ కనిపించదని యడ్యూరప్ప అన్నట్టుగా ఉంది. తాను రాజీనామా చేస్తే స్పీకర్ అంగీకరించకపోవచ్చని ఎమ్మెల్యే శివనగౌడ అభ్యంతరం చెప్పగా, దాని గురించి ఆలోచించ వద్దని, ఆ సంగతిని పెద్దలు చూసుకుంటారని భరోసా ఇచ్చారు. ప్రధాని, అమిత్ షా, గవర్నర్ లు మిగతా కథ నడిపిస్తారని అన్నారు. రాయచూర్ లో ఉన్న మార్వాడీల ద్వారా రూ. 20 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆడియో టేపులు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

More Telugu News