Chandrababu: చంద్రబాబును కలిస్తే విమర్శిస్తారా? మళ్లీ మీరు ఆయన తలుపు తట్టరనే గ్యారంటీ ఎక్కడుంది?: బీజేపీపై శివసేన ఫైర్

  • చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశాం
  • ఆకాశం వచ్చి మీద పడినట్టు ప్రవర్తిస్తున్నారు
  • ఎన్డీయే నుంచి బయటకు వచ్చినందుకు చంద్రబాబు హఠాత్తుగా అంటరానివాడు అయ్యారా?

బీజేపీపై శివసేన విమర్శలు గుప్పించింది. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ధర్నాకు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ హాజరైన సంగతి తెలిసిందే. దీనిపై తన అధికారిక పత్రిక సామ్నాలో శివసేన ఈరోజు కథనాన్ని ప్రచురించింది. మర్యాద పూర్వకంగానే చంద్రబాబు సభకు తాము హాజరయ్యామని తెలిపింది. ఇదే సమయంలో బీజేపీపై శివసేన మండిపడింది. మిత్రపక్షాలతో సరైన విధంగా వ్యవహరించడం లేదని విమర్శించింది.

ఎన్నికల తర్వాత కావాల్సినన్ని సీట్లు రాకపోతే చంద్రబాబు మద్దతును బీజేపీ కోరదనే గ్యారంటీ ఏముందని శివసేన ప్రశ్నించింది. చంద్రబాబు తలుపును బీజేపీ సీనియర్లు కొట్టరనే నమ్మకం ఏముందని నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా విడిపోయిందని... ఆ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. రాష్ట్రాల విభజనకు తాము వ్యతిరేకమని తెలిపింది. చంద్రబాబుకు తాము సంఘీభావం తెలిపితే... ఏదో ఆకాశం వచ్చి కేంద్ర ప్రభుత్వంపై పడినట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడింది. ఎన్డీయేతో కలిసున్నంత కాలం చంద్రబాబును గొప్ప నేతగా కొనియాడారని... ఎన్డేయే నుంచి బయటకు వచ్చిన వెంటనే హఠాత్తుగా ఆయన అంటరానివాడు అయిపోయాడని విమర్శించింది. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారని మండిపడింది.

పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు, జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు మఖ్బూల్ భట్ ల మృత అవశేషాలను తెప్పించాలని జమ్ముకశ్మీర్ లోని మెహబూబా ముఫ్తీ పార్టీ (పీడీపీ)కి చెందిన రాజ్యసభ సభ్యుడు ఫయాజ్ అహ్మద్ డిమాండ్ చేస్తున్నారని... మొన్నటి దాకా ఆ పార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకుందని శివసేన విమర్శించింది. బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సమయంలో కశ్మీర్ లో నెత్తుటి ఏర్లు పారాయని చెప్పింది. ఎన్నో దాడులు జరిగాయని, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారికి కూడా రివార్డులు దక్కాయని దుయ్యబట్టింది. దీనిపై ఎవరికీ ఎలాంటి సమస్య లేదని... చంద్రబాబు వద్దకు వెళ్లినందుకు మాత్రం తమను తీవ్రంగా విమర్శిస్తున్నారని మండిపడింది. పీడీపీ, టీడీపీలకు మధ్య ఉన్న తేడా ఏమిటో తమకు స్పష్టంగా తెలుసని చెప్పింది.

మరోవైపు, అఫ్జల్ గురు, భట్ ఇద్దరినీ తీహార్ జైల్లోనే ఖననం చేశారు. ఓ ఇంటెలిజెన్స్ అధికారిని చంపిన కేసులో భట్ ను 1984లో ఉరి తీశారు. అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరిలో ఉరి తీశారు.

More Telugu News