Tiger: చాన్నాళ్ల తర్వాత గుజరాత్ అడవుల్లో కనిపించిన పులి.. సంబరపడుతున్న ప్రభుత్వం

  • చివరిసారి 1989లో గుజరాత్‌లో కనిపించిన పులులు
  • ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తొలిసారి కెమెరా కంటికి చిక్కిన పులి
  • సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటుందని భావన

గుజరాత్ అటవీశాఖ అధికారులు తెగ సంబరపడిపోతున్నారు. దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత పులి కనిపించడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న దంగ్ అడవుల్లో మూడు దశాబ్దాల క్రితం చివరిసారిగా పులులు కనిపించగా ఆ తర్వాత వాటి జాడ లేకుండా పోయింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ పులి అడవిలో అమర్చిన కెమెరాకు చిక్కింది. లున్వాడ్-సంత్రాంపూర్ అడవుల్లో అమర్చిన కెమెరాకు సోమవారం రాత్రి ఓ పులి తిరుగాడుతూ చిక్కింది.

కెమెరాకు చిక్కిన పులి వయసు ఏడెనిమిది సంవత్సరాలు ఉంటుందని అటవీశాఖా మంత్రి గణ్‌పత్ వాసవ తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఏదో ఒక ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. మహేశ్ మహేరా అనే ఉపాధ్యాయుడు గతవారం బోరియా గ్రామంలో అడవిని దాటుతుండగా పులిని చూసినట్టు చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు ఐదు కెమెరాలను అమర్చారు. అటవీశాఖ రికార్డుల ప్రకారం దంగ్ అడవుల్లో చివరిసారి 1989లో పులులు కనిపించాయి. అప్పట్లో 13 పులులు ఉన్నట్టు గుర్తించారు. అయితే, 1992లో నిర్వహించిన పులుల గణనలో ఒక్కటి కూడా కనిపించలేదు.

More Telugu News