Tamil Nadu: 50 మంది ప్రయాణికులను రక్షించి గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఆర్టీసీ డ్రైవర్

  • డ్రైవింగ్‌లో ఉండగా గుండెపోటు
  • బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రాణాలొదిలిన డ్రైవర్
  • కన్నీళ్లు పెట్టుకున్న ప్రయాణికులు

తీవ్రంగా వేధిస్తున్న గుండెపోటు మరికొన్ని క్షణాల్లో తన ప్రాణాలు తీయబోతోందని తెలిసినా.. ఓ ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు పడిన తాపత్రయం అందరి గుండెలను పిండేస్తోంది. తమిళనాడులో జరిగిందీ ఘటన. 47 ఏళ్ల రమేశ్ తమిళనాడు ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

సోమవారం ఉదయం తిరువళ్లూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ బస్సులో విధుల్లో ఉన్నాడు. బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్సు మార్గమధ్యంలో ఉండగా ఒక్కసారిగా గుండె నొప్పితో రమేశ్ విలవిల్లాడిపోయాడు. తన ప్రాణాలు పోవడం ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన రమేశ్ బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నాడు. క్షణాల్లోనే బస్సును రోడ్డు పక్కకి తీసుకెళ్లి బ్రేక్ వేసి అలానే కుప్పకూలిపోయాడు.

షాక్‌కు గురైన ప్రయాణికులు, బస్ కండక్టర్ వెంటనే తేరుకుని 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అనంతరం చెన్నైలోని కీల్‌పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రమేశ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు. తమ ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ చేసిన సాహసం గురించి తెలిసి ప్రయాణికులు కంటతడి పెట్టుకున్నారు.

More Telugu News