Andhra Pradesh: 1,280 మంది వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారు.. అన్నింటినీ ఎత్తివేస్తాం!: జగన్

  • అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందిస్తాం
  • రాక్షసులు, మోసగాళ్లతో మన యుద్ధం
  • అనంతపురంలో ‘సమరశంఖారావం’ సభలో జగన్

దేవుడి దయతో అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామని ఆ పార్టీ అధినేత జగన్ తెలిపారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అన్నిరకాలుగా ఆదుకుంటామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల కాలంలో ఏపీలో 1,280 మంది వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ఈరోజు వైసీపీ బూత్ స్థాయి కార్యకర్తలతో జరిగిన ‘సమర శంఖారావం’ సభలో జగన్ మాట్లాడారు.

అవినీతిలేని స్వచ్ఛమైన పాలనను వైసీపీ అందిస్తుందని జగన్ తెలిపారు. తాము కులం, మతం, ప్రాంతం, పార్టీల ఆధారంగా వివక్ష చూపబోమని స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని జగన్ అన్నారు. ఇంకో 3 నెలలలోపు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత కార్యకర్తల భుజస్కందాలపై ఉందని వ్యాఖ్యానించారు.

ఈరోజు నీతిమంతమైన వ్యక్తులతో వైసీపీ పోరాటం చేయడం లేదని జగన్ అభిప్రాయపడ్డారు. ఈరోజు రాక్షసులు, మోసగాళ్లు, అన్యాయానికి ప్రతిరూపమైన వాళ్లతో యుద్ధం చేస్తున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్లను తొలగించే కార్యక్రమం సాగుతోందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనీ, జాబితాను చెక్ చేసుకోవాలని సూచించారు. వైసీపీ మద్దతుదారుల ఓట్లు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో 59.18 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని జగన్ అన్నారు.

More Telugu News