West Bengal: అవినీతి పరులను కాపాడేందుకు ఏ ముఖ్యమంత్రీ ధర్నా చేయలేదు!: మమతపై మోదీ ఫైర్

  • శారదా కుంభకోణం నిందితులను వదిలే ప్రసక్తే లేదు
  • అవినీతి నేతలందరూ మహాకల్తీ కూటమిగా ఏర్పడ్డారు
  • ఈ కల్తీ కూటమితో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శారదా కుంభకోణం నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పశ్చిమబెంగాల్ లోని జల్పాయ్ గిరిలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఏ ముఖ్యమంత్రీ కూడా అవినీతి పరులను కాపాడేందుకు ధర్నా చేయలేదని అన్నారు. ఈ కుంభకోణం కేసులో నిందితులను కాపాడే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా మహా కల్తీ కూటమి ఏర్పడింది


అంతకుముందు, ఛత్తీస్ గడ్ లో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన నేతలందరూ బీజేపీకి వ్యతిరేకంగా మహాకల్తీ కూటమిగా ఏర్పడ్డారని నిప్పులు చెరిగారు. మోదీని ఎవరు ఎక్కువ దూషిస్తే, కల్తీ కూటమిలో ప్రవేశానికి వారే అర్హులని, దేశ భవిష్యత్ కోసం వారి వద్ద ఎలాంటి కార్యక్రమాలు లేవని, అందుకే, ఈ కల్తీ కూటమి నేతలు మోదీని ఒక సమస్యగా భావిస్తున్నారని, ఈ కల్తీ కూటమితో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 అవినీతిలో కూరుకుపోయిన వారికి ఎటువంటి సిద్ధాంతాలు లేవని, అవినీతికి పాల్పడడం, దీనికి పాల్పడే వారికి మద్దతివ్వడమే వారి రాజకీయమని దుమ్మెత్తిపోశారు. ఎంతమంది కలిసినా ఈ దేశ కాపలాదారు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

More Telugu News