Supreme Court: మాతోనే ఆడుకుంటారా? దేవుడే మిమ్మల్ని కాపాడాలి: సీబీఐ నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • ఏకే శర్మను బదిలీ చేయవద్దని చెప్పినా బదిలీ చేస్తారా?
  • మా ఆదేశాలను కాదని కేంద్రం ఎలా బదిలీ చేస్తుంది?
  • కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు.. వివరణ ఇవ్వండి

సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను ఖాతరు చేయకుండా తమతోనే ఆడుకుంటారా? అంటూ కన్నెర్రజేసింది. దేవుడే మిమ్మల్ని కాపాడాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీహార్ లోని షెల్టర్ హోమ్స్ లో బాలికలపై జరిగిన అత్యాచారాల విచారణకు సంబంధించిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, దీనిపై వివరణ ఇవ్వాలని నాగేశ్వరరావును ఆదేశించింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, బాలికలపై అత్యాచారాల కేసును సీబీఐ అధికారి ఏకే శర్మ విచారిస్తున్నారు. ఇదే సమయంలో సీబీఐ మాజీ బాస్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం నేపథ్యంలో... నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక చీఫ్ గా నియమించారు. బాధ్యతలను స్వీకరించిన వెంటనే పలువురు సీబీఐ అధికారులను నాగేశ్వరరావు బదిలీ చేశారు. బదిలీకి గురైన వారిలో ఏకే శర్మ కూడా ఉన్నారు.

అయితే, కేసును ఏకే శర్మ నేతృత్వంలోని టీమ్ మాత్రమే విచారించాలని సుప్రీం అప్పట్లో ఆదేశించింది. తమ ఆదేశాలను సైతం పక్కన పెట్టి ఏకే శర్మను బదిలీ చేశారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మాట్లాడుతూ, నాగేశ్వరరావు, ప్రాసిక్యూషన్ ఇన్ ఛార్జి భాసురన్ లే దీనికి కారణమని అన్నారు. తమ ఆదేశాలతోనే ఆడుకున్నారని.. దేవుడు మాత్రమే మిమ్మల్ని కాపాడతాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

యాంటీ కరప్షన్ డిపార్ట్ మెంట్ ఇన్ ఛార్జ్ గా ఉన్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను ట్రాన్స్ ఫర్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా... కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎలా బదిలీ చేస్తుందని రంజన్ గొగోయ్ ప్రశ్నించారు. కేబినెట్ లోని అపాయింట్స్ మెంట్ కమిటీకి శర్మను బదిలీ చేయవద్దనే తమ ఆదేశాలు అందలేదని అనిపిస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాకేష్ ఆస్థానాపై ఉన్న ఆరు కేసులను విచారిస్తున్న శర్మతో పాటు మరో ఐదుగురు అధికారులను సీబీఐ బదిలీ చేసింది. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను లీవుపై వెళ్లాలని ఆదేశించిన రోజుల వ్యవధిలోనే ఈ బదిలీలు జరిగాయి.

More Telugu News