Kerala: కేరళ మత్స్యకారులకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి.. నోబెల్ కమిటీ చైర్మన్ కు కాంగ్రెస్ నేత శశిథరూర్ లేఖ!

  • కేరళ జాలర్లు ధైర్యసాహసాలు ప్రదర్శించారు
  • సొంతిళ్లు కూలిపోతున్నా సహాయక చర్యల్లో పాల్గొన్నారు
  • ట్విట్టర్ లో లేఖను పోస్ట్ చేసిన శశిథరూర్

గతేడాది ఆగస్టులో కేరళను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వరదల ప్రభావంతో వందలాది మంది చనిపోగా, వేలాది మంది నీటిలో చిక్కుకుపోయారు. ఇలా వరదల్లో చిక్కుకున్న చాలామందిని కేరళ జాలర్లు ప్రాణాలకు తెగించి రక్షించారు. తమ వీపునే మెట్లుగా మార్చి ప్రజలను పడవల్లోకి ఎక్కించుకుని అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో వారి కష్టానికి గుర్తింపు దొరికేలా చేసేందుకు కాంగ్రెస్ నేత తిరువనంతపురం లోక్ సభ సభ్యుడు శశిథరూర్ సిద్ధమయ్యారు.
కేరళ వరదల్లో సహాయక చర్యల్లో ధైర్యంగా పాల్గొన్న మత్స్యకారులకు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని శశిథరూర్ నోబెల్ కమిటీని కోరారు. సొంత ఇళ్లు కూలిపోతున్నా పట్టించుకోకుండా వీరంతా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. మత్స్యకారుల త్యాగం, సాయానికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రీస్ అండర్సన్ కు లేఖ రాశారు. దీన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

More Telugu News