Visakhapatnam: విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రమాదం...బ్రేకులు ఫెయిలై లారీ బీభత్సం

  • రక్షణ గోడను ఢీకొట్టి పిల్లల పార్క్‌వైపు దూసుకుపోయిన వాహనం
  • పంది మెట్ట రోడ్డులో వస్తుండగా ఘటన
  • తెల్లవారు జామున ఘటన జరగడంతో తప్పిన ప్రాణనష్టం

సరిగ్గా మూడేళ్ల క్రితం...అదే ప్రాంతంలో ఓ స్కూల్‌ బస్సు సృష్టించిన బీభత్సంలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు అదే ప్రాంతంలో అదే తీరులో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఘటన జరిగింది తెల్లవారు జామున కావడం, ఆ సమయానికి ఇంకా వాకర్స్‌ కూడా రాకపోవడంతో అదృష్టవశాత్తు పెద్ద ఘోరమే తప్పింది. విశాఖ  నగరం బీచ్‌ రోడ్డులో అదుపుతప్పిన ఓ లారీ గురువారం తెల్లవారు జామున బీభత్సం సృష్టించడం స్థానికంగా సంచలనమైంది. బీచ్‌ రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌ జంక్షన్‌లో జరిగిన ఈ ప్రమాదం వివరాలిలావున్నాయి.

హోటల్‌ను ఆనుకుని ఉన్న పందిమెట్ట రోడ్డు మీదుగా ఇసుక లోడుతో బీచ్‌  రోడ్డు వైపు లారీ వస్తోంది. ఇక్కడ వాహనం మలుపు తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్డు ఎత్తుగా ఉండడం, లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో వాహనం అదుపుతప్పి నేరుగా వెళ్లి రక్షణ గోడను ఢీకొట్టింది. గోడను ధ్వంసం చేసుకుంటూ అటువైపు ఉన్న పిల్లల పార్క్‌వైపు దూసుకుపోయింది. లారీ ఢీకొట్టిన ప్రాంతంలో సాధారణంగా బీచ్‌ సందర్శకులు ఎప్పుడూ కూర్చుని ఉంటారు. తెల్లవారు జాము కావడంతో ఘటన జరిగిన సమయానికి అక్కడ ఎవరూ లేరు.

గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఘోరం జరిగింది. అప్పుడు స్కూలు బస్సు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టి బీచ్‌ వైపు దూసుకుపోయింది. ఘటన పగలు జరగడంతో గోడపై సందర్శకులు కూర్చుని ఉండడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. అప్పుడు చనిపోయిన వారిలో ఓ పోలీసు అధికారి తండ్రి, కొడుకు ఉండగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే ప్రాంతంలో ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు ఇప్పటికైనా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

More Telugu News