day teparature increased: రాత్రి చలి... ఉదయం మంచుదుప్పటి... మధ్యాహ్నం ఎండ!

  • రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం
  • పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల
  • మంచు దుప్పటితో ఉదయం వాహనాల రాకపోకలకు ఇబ్బంది

రాత్రి వణికిస్తున్న చలి... ఉదయం కప్పేస్తున్న మంచు దుప్పటి...మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ...ప్రస్తుతం రెండు రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం ఇది. సంక్రాంతి తర్వాత సాధారణంగా చలి తగ్గుముఖం పట్టి పగటి ఉష్ణోగ్రతలు పెరగడం సహజం. కానీ ఈ ఏడాది ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా నిన్నమొన్నటి వరకు చలి వణికించింది. ఇప్పటికీ రాత్రిపూట చలి అలాగే ఉన్నా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ ఉదయం పూట మంచుదుప్పటి వదలడం లేదు. బుధవారం ఉదయం పర్చుకున్న మంచుదుప్పటి కారణంగా 40 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎదురుగా వచ్చే వాహనం సమీపంలోకి వచ్చే వరకు కనిపించక పోవడంతో ప్రమాద భయంతో ప్రయాణించాల్సి వస్తోందని పలువురు వాహన చోదకులు వాపోతున్నారు.

వాహనాల లైట్లు వేసుకుని వెళ్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదని చెబుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు దాటేందుకు జనం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మధ్య భారతాన్ని వీడని చలి వాతావరణం కారణంగా ఉత్తర కోస్తాలో రాత్రిపూట చలిగాలులు వీస్తున్నాయి.

ఒడిశాలో రాత్రిపూట 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఆ ప్రభావం ఉత్తర కోస్తాపై కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. మరో రెండు మూడు రోజులపాటు రాత్రిపూట చలి పరిస్థితి ఇలాగే ఉండవచ్చని ఆ అధికారి తెలిపారు. మరోవైపు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో మంగళవారం పగటి ఉష్ణొగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

More Telugu News