Kerala: శబరిమల సంప్రోక్షణ అతివల కోసం కాదు: ప్రధాన పూజారి కీలక నివేదిక

  • గత నెల 2న ఆలయంలో ప్రవేశించిన ఇద్దరు మహిళలు
  • మలినాలు, అపరిశుభ్రత కారణంగా రెండు రోజులకోసారి సంప్రోక్షణ
  • మహిళలు వచ్చినందుకేమీ కాదన్న ప్రధాన పూజారి

గత నెల 2వ తేదీన కేరళ, శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి బిందు అమ్మణ్ణి, కనకదుర్గలు ప్రవేశించిన తరువాత, ఆలయ ప్రధాన పూజారి రాజీవరు, గర్భగుడి తలుపులు మూసివేసి, సంప్రోక్షణం జరిపిన సంగతి తెలిసిందే. ఈ చర్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని బిందు అమ్మణ్ణి కోర్టును ఆశ్రయించింది కూడా. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కేరళ సీఎం పినరయి విజయన్ టీబీడీ (ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు)ను ఆదేశించారు.

దీంతో టీబీడీ రాజీవరుకు నోటీసులు జారీ చేయగా, "ఆలయం ఎన్నో రకాలుగా అశుభ్రతకు గురవుతుంది. అనేక రకాల మలినాలు గర్భాలయంలోకి చేరుతుంటాయి. వాటిని తొలగించే క్రమంలో మేము రెండు రోజులకు ఒకసారి సంప్రోక్షణ చేస్తుంటాము. జనవరి 2న జరిగిన శుద్ధి కార్యక్రమం కూడా అందులో భాగమే. మహిళలు వచ్చినందుకు మేమేమీ ఆలయాన్ని శుద్ధి చేయలేదు" అని తెలిపారు. అయితే, టీబీడీ అనుమతి లేకుండా పూజారి ఆలయాన్ని సంప్రోక్షణ చేశాడని, ఇది మంచి పద్ధతి కాదని టీబీడీ అధ్యక్షుడు పద్మకుమార్‌ తెలిపారు.

More Telugu News